హెచ్ఆర్ మేనేజర్లే టార్గెట్.. అడిగినంత ఇవ్వకుంటే రేప్ కేస్

వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్ మేనేజర్‌లను టార్గెట్ చేసి, స్నేహం పేరుతో  సంబంధాలు పెంచుకుని, ఆ తర్వాత అడిగినంత ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన యువతిని పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఆ మహిళ తనతో చనువు పెంచుకున్న ఓ హెచ్ఆర్ మేనేజర్‌ను ఏడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. లేదంటే అత్యాచారం కేసు పెడతానంటూ అతన్ని బెదిరించింది . పరువు పోతుందన్న భయంతో ఆ మేనేజర్ ఆమె చెప్పిన డిమాండ్ కు ఒప్పుకున్నాడు. మొదటి విడతగా.. రూ.45,000 ఇచ్చాడు. మిగిలిన రూ .6.5 లక్షలు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఆమె వేధింపులకు పాల్పడింది. తట్టుకోలేని బాధితుడు పోలీసులకు అసలు విషయం చెప్పగా.. వారు పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను శనివారం అరెస్ట్ చేశారు.

ఆ మహిళ  మరో వ్యక్తి సాయంతో వివిధ కంపెనీల హెచ్ఆర్ మేనేజర్‌లను టార్గెట్ చేసేదని, ఆ తర్వాత టైం చూసి వారిని డబ్బు కోసం డిమాండ్ చేసేదని ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర మొహిలే తెలిపారు. వారిద్దరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. కోర్టు  జనవరి 29 వరకు రిమాండ్‌కు తరలించింది.