ప్రియుడితో వెళ్లిపోయింద‌ని కూతుర్ని చంపేసిన ఫ్యామిలీ.. త‌ల్లి స‌హా ఐదుగురి అరెస్ట్

ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవాల‌నుకుందా యువ‌తి. ప్రేమ పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ప్రియుడితో హాయిగా జీవించొచ్చ‌ని ఆశ‌ప‌డింది. కానీ క‌న్న‌వారి కోపం బిడ్డ ప్రాణం తీసే దాకా వెళ్లింది. బ‌ల‌వంతంగా వెన‌క్కి తీసుకొచ్చి.. నిద్ర ఉండ‌గా కూతురిని హ‌త్య చేసి, ర‌హ‌స్యంగా ద‌హ‌నం చేసేశారు. ఈ దారుణం పంజాబ్ లోని హోషియార్పూర్ జిల్లాలో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో యువ‌తి త‌ల్లి స‌హా ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. అందులో ఒక వ్య‌క్తి పంజాబ్ సీఎం సెక్యూరిటీ వింగ్ లో ప‌ని చేసే పోలీస్ ఉన్నాడ‌ని తెలిపారు.

హోసియార్పూర్ జిల్లాలోని సౌలీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువ‌తి జ‌స్ ప్రీత్ కౌర్ భ‌జ్లాన్ గ్రామానికి చెందిన అమ‌న్ ప్రీత్ సింగ్ అనే యువ‌కుడిని ప్రేమించింది. పెద్ద‌లు వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌క‌పోవ‌డంతో గ‌త వారంలో ఆమె త‌న ప్రియుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింది. దీంతో త‌న కుమార్తె క‌నిపించ‌డం లేద‌ని, ఆమెను అమ‌న్ కిడ్నాప్ చేసి ఉంటాడ‌ని ఏప్రిల్ 22న‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది ఆ యువ‌తి త‌ల్లి బ‌ల్వింద‌ర్ కౌర్. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ త‌ర్వాతి రోజే‌ బ‌ల్వింద‌ర్ కౌర్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి.. త‌న కుమార్తె స‌మీపంలోని రైల్వే స్టేష‌న్ ద‌గ్గ‌ర క‌నిపించింద‌ని, ఆమెను ఇంటికి తీసుకొచ్చామ‌ని చెప్పింది. అయితే ఆమె తీరుపై అనుమానం వ‌చ్చిన పోలీసులు త‌మ ఎంక్వైరీని కొన‌సాగించారు.

జ‌స్ ప్రీత్ కౌర్ త‌న ప్రియుడు అమ‌న్ ఊరికి వెళ్లిపోతే.. ఆమె కుటుంబం అక్క‌డికి వెళ్లి గ్రామ పెద్ద‌ల‌తో పంచాయితీ చేయించి కూతురిని వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఆమెను తాను బ‌ల‌వంతంగా ఏమీ తీసుకెళ్ల‌లేద‌ని, ఇద్దరం ప్రేమించుకుంటున్నామ‌ని అమ‌న్ వారికి చెప్పాడు. త‌మ‌ను ఒక్క‌టి చేయాల‌ని కోరాడు. దీనిపై పోలీసులు బ‌ల్వింద‌ర్ కౌర్ ను పోలీసులు ప్ర‌శ్నించారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. ప్రేమించిన వ్య‌క్తితో వెళ్లిపోవ‌డంతో ప‌రువు పోయింద‌ని హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు చెప్పింది.

నిద్ర‌మాత్ర‌లిచ్చి.. హ‌త్య‌

ఏప్రిల్ 25న రాత్రి జ‌స్ ప్రీత్ కు ఆమె త‌ల్లి బ‌ల్వింద‌ర్ నిద్ర‌మాత్ర‌లిచ్చింది. ఆమె నిద్ర‌పోయిన త‌ర్వాత త‌న క‌జిన్ శివ్ రాజ్, అత‌డి ద‌గ్గ‌ర ప‌ని చేసే లాలా అనే వ్య‌క్తి క‌లిసి చంపేశారు. ఆ త‌ర్వాత జ‌స్ ప్రీత్ అంకుల్ స‌త్య‌దేవ్, క‌జిన్ గురుదీప్ సింగ్ ర‌హ‌స్యంగా ఆమె మృత‌దేహాన్ని ద‌హ‌నం చేశారు. ఆ ఫ్యామిలీపై అనుమానంతో ద‌ర్యాప్తు చేయ‌డంతో ఈ దారుణం గురించి బ‌య‌ట‌ప‌డిందని హోషియార్పూర్ స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ఇక్బాల్ సింగ్ చెప్పారు. ఈ నేరానికి పాల్ప‌డిన యువ‌తి త‌ల్లి బ‌ల్వింద‌ర్ కౌర్ స‌హా ఐదుగురిని అరెస్టు చేశామ‌ని తెలిపారు. అందులో గురుదీప్ సింగ్ సీఎం సెక్యూరిటీ వింగ్ లో పోలీస్ అని చెప్పారు.

Latest Updates