విద్యార్థులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్లు

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన మొదటి విడతగా పంజాబ్ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో ప్రారంభించబోతున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్మార్ట్ ఫోన్లను విద్యార్థులకు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12వ తరగతి చదవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను అందిస్తామని పంజాబ్ సర్కారు గతంలోనే ప్రకటించింది. కరోనా సంక్షోభ సమయంలో ఆన్ లైన్ లో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలను పరిష్కారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

ఇందులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి(ఆగస్టు-12) న ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించాలని సీఎం నిర్ణయించారు. ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువ దినోత్సవం కూడా రావడంతో స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశ కింద రాష్ట్రంలో 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా 50వేల ఫోన్లను ఇప్పటికే తెప్పించిన అమరేందర్ సింగ్ ప్రభుత్వం.. త్వరలోనే విద్యార్థులందరికీ అందజేయనున్నట్లు తెలిపింది.

Latest Updates