కోల్ కతాపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ

కోల్ కతాపై  8 వికెట్ల తేడాతో గెలుపు
వరుసగా ఐదో విజయం
హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన గేల్, మన్ దీప్ 

ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జూలు విదిల్చింది..! టార్గెట్ ఛేజింగ్‌లో మన్దీప్ (56 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 నాటౌట్), క్రిస్ గేల్ (29 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51) నిలకడగా ఆడటంతో.. బలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెక్ పెట్టింది..! ఫలితంగా పంజాబ్ వరుసగా ఐదో విజయంతో టేబుల్లో నాలుగో ప్లేస్‌కు చేరి నాకౌట్ రేస్‌ను మరింత రసవత్తరంగా మార్చేసింది..! మరోవైపు శుభ్‌మన్ గిల్ (45 బాల్స్‌లో
3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57), మోర్గాన్ (25 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) మినహా మిగతా వారు విఫలంకావడంతో.. చేజేతులా మ్యాచ్‌ను వదిలేసుకున్న నైట్‌రైడర్స్.. మరో గేమ్ వరకు ఆగాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది..!!

షార్జా: వారెవ్వా.. పంజాబ్..! వేదికలు మారినా.. ప్రత్యర్థులు మారినా తమ విజయాల్లో మాత్రం తేడా రాకుండా దూసుకుపోతున్నది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. సోమవారం జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కోల్‌కతాపై గెలిచింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 149/9 స్కోరు చేసింది. పేసర్ మహ్మద్ షమీ (3/35) అద్భుతమైన బౌలింగ్‌తో నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 150/2 స్కోరు చేసి నెగ్గింది. క్రిస్ గేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
తడబడి.. నిలబడి
ఫ్లాట్ వికెట్‌పై భారీ అంచనాలతో బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతాకు ఆరంభం నుంచి వరుస షాక్‌లు తగిలాయి. ఇన్నింగ్స్ రెండో బాల్‌కు నితీశ్ రాణా (0)ను మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు. ఎదుర్కొన్న ఫస్ట్బాల్ను రాహుల్ త్రిపాఠి (7)… డీప్ మిడ్ వికెట్లో సిక్సర్‌గా మలిచాడు. కానీ ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సెకండ్ ఓవర్లో షమీ డబుల్ ఝలక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో త్రిపాఠి, కార్తీక్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో కేకేఆర్ స్కోరు 10/3గా మారింది. అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడినా.. శుభ్‌మన్ గిల్, మోర్గాన్ అదురు, బెదురు లేకుండా రెచ్చిపోయారు. షమీ వేసిన ఆరో ఓవర్లో మోర్గాన్ రెండు ఫోర్లు కొడితే, గిల్ రెండు సిక్సర్లు దంచాడు. ఫలితంగా పవర్‌ప్లేలో స్కోరు 54/3కి చేరింది. మళ్లీ మ్యాక్సీని తీసుకొచ్చినా.. ఏడో ఓవర్లో 4, 6 ఇచ్చుకున్నాడు. తర్వాతి ఓవర్లో స్పిన్నర్ అశ్విన్ (1/27)ను కూడా రెండు సిక్సర్లతో దంచికొట్టారు. తర్వాత జోర్డాన్ (2/25) 2 రన్సే ఇచ్చినా… 10వ ఓవర్లో గిల్ సిక్సర్ కొట్టినా.. మోర్గాన్‌ను ఔట్ చేసి రవి ఝలక్ ఇచ్చాడు. నాలుగో వికెట్‌కు 81 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఓవరాల్‌గా ఫస్ట్ టెన్‌లో నైట్‌రైడర్స్ 91/4 స్కోరు చేసింది. ఓ ఎండ్‌లో గిల్ స్థిరంగా ఆడినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు పడటం కోల్‌కతాను దెబ్బతీసింది. 11వ ఓవర్లో నరైన్ (6) ఔట్‌తో మొదలైన పతనం చకచకా సాగింది. స్పిన్నర్లు రన్స్ కట్టడి చేయడంతో రన్‌రేట్ కూడా మందగించింది. 15వ ఓవర్లో నాగర్కోటి (6), తర్వాతి ఓవర్లో కమిన్స్ (1) కూడా పెవిలియన్‌కు చేరారు. గిల్‌కు జతయిన ఫెర్గుసన్ (24 నాటౌట్) ఫోర్లతో జోరు చూపే ప్రయత్నం చేశాడు. 36 బాల్స్‌లో ఫిఫ్టీ కంప్లీట్ చేసిన గిల్‌తో పాటు వరుణ్ (2) కూడా వెనుదిరగడంతో కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
మన్ దీప్ కేక..
టార్గెట్ ఛేజింగ్‌లో పంజాబ్‌కు రాహుల్ (28), మన్దీప్ మంచి ఆరంభాన్నిచ్చారు. ఫోర్‌తో ఖాతా ఓపెన్ చేసిన రాహుల్.. వీలైనప్పుడల్లా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కమిన్స్ బాల్స్‌ను 6, 4గా మలిచి తన ఉద్దేశాన్ని చెప్పిన మన్దీప్ కూడా నిలకడగా ఆడటంతో పవర్‌ప్లేలో పంజాబ్ 36 రన్స్ చేసింది. బౌలింగ్ మార్పులో భాగంగా రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లు రావడంతో రాహుల్ కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో 8వ ఓవర్లో వరుణ్ బాల్‌కు వికెట్ల ముందు దొరికాడు. ఫస్ట్ వికెట్‌కు 47 పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. గేల్ వచ్చిరావడంతోనే దూకుడు మొదలుపెట్టాడు. 10వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో 17 రన్స్ పిండుకున్నారు. దీంతో స్కోరు 67/1కు చేరింది. ఆ తర్వాత కూడా కరీబియన్ ఎక్కడా తగ్గలేదు. నరైన్ వరుస ఓవర్లలో రెండు సిక్సర్లు మధ్యలో ఫోర్లతో రన్‌రేట్‌ను అమాంతం పెంచేశాడు. దీంతో 14వ ఓవర్లో పంజాబ్ స్కోరు 100 దాటింది. ఇక్కడి నుంచి ఇద్దరూ జోరు పెంచారు. వేగంగా సింగిల్స్, డబుల్స్‌తో పాటు బౌండరీలు కూడా బాదేశారు. దీంతో లాస్ట్ రెండు ఓవర్లలో 19 రన్స్ రావడంతో పంజాబ్ విజయసమీకరణం 24 బాల్స్‌లో 27 రన్స్‌గా మారింది. 17వ ఓవర్లో గేల్ 4, 6తో 17 రన్స్ రాబట్టగా, తర్వాతి ఓవర్లో మన్దీప్ 4, 6తో 11 రన్స్ సాధించాడు. ఇక 12 బాల్స్‌లో 3 రన్స్ కావాల్సిన టైమ్‌లో క్రిస్ గేల్ ఔటైనా.. నికోలస్ పూరన్ (2 నాటౌట్), మన్దీప్ విజయలాంఛనం పూర్తి చేశారు. రెండో వికెట్‌కు గేల్ 100 రన్స్ జోడించాడు.

కోల్ కతా: గిల్ (సి) పూరన్ (బి) షమీ 57, రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్‌వెల్ 0, త్రిపాఠి (సి) రాహుల్ (బి) షమీ 7, కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0, మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి 40, నరైన్ (బి) జోర్డాన్ 6, నాగర్కోటి (బి) అశ్విన్ 6, కమిన్స్ (ఎల్బీ) రవి 1, ఫెర్గుసన్ (నాటౌట్) 24, వరుణ్ (బి) జోర్డాన్ 2, ప్రసిద్ధ్ కృష్ణ (నాటౌట్) 0

ఎక్స్ ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 149/9

వికెట్లపతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్షదీప్ సింగ్ 2–0–18–0, అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి 4–1–20–2.
పంజాబ్: రాహుల్ (ఎల్బీ) వరుణ్ 28, మన్దీప్ (నాటౌట్) 66, గేల్ (సి) ప్రసిద్ధ్ కృష్ణ (బి) ఫెర్గుసన్ 51, పూరన్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 3,

మొత్తం: 18.5 ఓవర్లలో 150/2.
వికెట్లపతనం: 1–47, 2–147. బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసిద్ధ్ కృష్ణ 3–024–0, వరుణ్ 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గుసన్ 3.5–0–32–1.

Latest Updates