రైతుల నిరసనలకు పంజాబ్‌‌‌దే బాధ్యత

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రగడ నడుస్తోంది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీకి వస్తున్న రైతులను నిలువరించడానికి పోలీసులు టియర్ గ్యాస్‌‌ను ప్రయోగించడంతో ఈ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ఛలో ఢిల్లీలో తమ రాష్ట్ర రైతులు పాల్గొనలేదని ఖట్టర్ స్పష్టం చేశారు. ఈ నిరసనలకు పంజాబ్‌‌‌ బాధ్యత తీసుకోవాలన్నారు.

‘ఈ ఉద్యమాన్ని పంజాబ్ రైతులే ప్రారంభించారు. ఈ ఆందోళనలకు కొన్ని పార్టీలు, యూనియన్లకు సంబంధం ఉంది. ఛలో ఢిల్లీలో హర్యానా రైతులు భాగం కాలేదు. అందుకు వారిని నేను అభినందిస్తున్నా. గత రెండ్రోజులగా తమ విధులను బాధ్యతతో నిర్వహిస్తున్న హర్యానా పోలీసులు ప్రశంసలకు అర్హులు. అసలు రైతులు ఇంత భారీ సంఖ్యలో వెళ్లి కేంద్రాన్ని కలవాల్సిన అవసరం లేదు. రైతుల తరఫున కొందరు ప్రతినిధులు వెళ్లి కేంద్రాన్ని కలిస్తే బాగుంటుందని అన్నదాతలను నేను కోరుతున్నా’ అని ఖట్టర్ పేర్కొన్నారు.

Latest Updates