ఓపిగ్గా ప్రూఫ్ లు చూసేవారు..ఆయన జ్ఞాపకశక్తి ఆశ్చర్యం కలిగించేది

అప్పుడు నేను ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో ఉన్నాను. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారు రాసిన ‘ది ఇన్ సైడర్’ నుంచి ఒక ఇంగ్లిష్ పత్రిక ప్రచురించిన కత్తిరింపుల్ని చూసి, ‘దీనిని తెలుగులోకి తెస్తే బాగుంటుందే’ అనుకున్నాను. అనువాదానికి అలవాటు పడిన చేయి కావడం తప్ప అందుకు మరో కారణం లేదు. అంతలోనే.. నన్నెవరు అడుగుతారులే, అడిగినా అంత పెద్ద పుస్తకాన్ని అనువదించేందుకు నాకు తీరికెక్కడుందిలే అనుకున్నాను. కానీ అనుకోని కొన్ని నిర్ణయాలు నన్ను అటువైపు నడిపించాయి. ఆంధ్రప్రభ-ఇండియన్ ఎక్స్ ప్రెస్ యజమాని మనోజ్ కుమార్ సొంతాలియా పీవీగారి పుస్తకాన్ని తెలుగు చేయించి సీరియల్ గా వేస్తే బాగుంటుందని చెప్పారని, మీరే అనువాదం చేయాలని సంపాదకులు వి. వాసుదేవదీక్షితులుగారు నాతో అన్నారు. ఉద్యోగ ధర్మంగా సరేనని అనువాదం ప్రారంభించాను.

ప్రూఫ్ రీడింగ్ చేసిన పీవీ

ప్రతి అధ్యాయం నేను చూడాల్సిందేనని పీవీగారి షరతు. దాంతో నేను రాసింది కంపోజ్ చేయించి, ప్రూఫ్ రీడింగ్ చేసి ఢిల్లీకి కంటైనర్ లో పంపించడం, అక్కడి మా ఢిల్లీ ప్రతినిధి వాటిని పీవీగారికి పంపే ఏర్పాటు చేయడం, ఆయన వాటిని చూసి తిప్పి పంపడం.. ఇలా చివరివరకూ జరిగింది. 1998–99 నాటికి కంప్యూటర్ ద్వారా నేరుగా తెలుగు టెక్స్ట్ ను పంపించే సదుపాయం లేదు. ఎంత జాగ్రత్తగా చూసినా ప్రూఫ్ తప్పులు ఉండేవి. ఆశ్చర్యం ఏమిటంటే, భూతద్దం లాంటి పీవీగారి చూపులనుంచి అవి తప్పించుకోలేకపోయేవి. మాజీ ప్రధాని అక్షరాలా పెన్నుతో ప్రూఫ్ తప్పులు దిద్ది మరీ పంపేవారు. అందులో ఆయన చేయి తిరిగిన వ్యక్తిలా కనిపించేవారు. ఒకసారి ఆయన ‘లోపలి మనిషి’ ప్రూఫులు దిద్దుతున్న సంగతి పత్రికల్లో మొదటి పేజీలో వచ్చింది. ఆయన ఏదో అనారోగ్య సమస్యతో ఢిల్లీలో ఆసుపత్రిలో చేరినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి చూడడానికి వెళ్లారట. అప్పుడు పీవీగారు ఆసుపత్రి బెడ్డు మీద కూర్చుని ప్రూఫులు దిద్దుతున్నారట. కోట్లవారు పత్రికలవారికి చెప్పిన ఈ విషయం మొదటి పేజీ వార్త అయింది. అనువాదం జరుగుతున్నంతకాలం ఆయనను హైదరాబాద్ లో అనేకసార్లు కలుసుకున్నాను. రాజ్ భవన్ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లో దిగేవారు. మొదటిసారి కలుసుకున్నప్పుడు, విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో తను హిందీలోకి అనువదించినప్పటి అనుభవాలు చెప్పారు. నవల మరీ పెద్దదిగా ఉంది, తగ్గించాలని హిందీ పబ్లిషర్ పట్టుబట్టాడట. సత్యనారాయణగారితో చెబితే ఆయన తగ్గించడానికి వీల్లేదన్నారట. చివరికి ఎలాగో ఆయనను తను ఒప్పించాడట. ‘ఇన్ సైడర్’ అనువాదంలో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. పీవీ గారు భారత్-చైనా యుద్ధం గురించి, భారత్-పాకిస్తాన్ యుద్ధం గురించి చాలా ఎక్కువగా రాశారు. ఒక పుస్తకంగా చదువుకునేటప్పుడు అవి విలువైన విషయాలే కానీ, డైలీ సీరియల్ గా ప్రచురిస్తున్నప్పుడు కథ కుంటుపడి, పాఠకుడి ఆసక్తిని తగ్గిస్తాయేమోనని నా భయం. ఇదే మాట ఆయనకు ఫోన్ చేసి అంటే, ఎట్టి పరిస్థితిలోనూ తగ్గించడానికి వీల్లేదని అన్నారు. అంతటితో ఊరుకోకుండా అవి ఎందుకు ఉండాలో వివరిస్తూ నాకు మరునాడు ఒక ఉత్తరం రాశారు. చివరిగా, ఎవరి చాదస్తం వారికి నచ్చుతుంది కనుక అవి అలా ఉండాల్సిందేనన్నారు. ఎలాగూ ఆయన చూస్తున్నారు కనుక అనువాదం చేసి నేను చేతులు దులుపుకుంటే సరిపోయేది కానీ, ఎక్కడైనా సందేహాలు కలిగినప్పుడు ఊరుకోలేకపోయేవాడిని. అదెలా, ఇదెలా అని అడిగేవాడిని. ఆయన నా ప్రతి సందేహానికీ ఓపికగా సమాధానం చెప్పేవారు. అవసరమనుకున్నప్పుడు ఉత్తరం కూడా రాసేవారు. ఎమెస్కో ప్రచురించిన ‘లోపలి మనిషి’ పుస్తకావిష్కరణ విజయవాడలోనూ, విశాఖపట్నంలోనూ జరిగినప్పుడు ఆయన నా గురించి చెబుతూ, “ఇతను మామూలు అనువాదకుడు కాదు, చాలా లోతుగా చూసి సందేహాలు లేవదీసేవాడు, ఆవిధంగా ట్రాన్స్ లేటర్ కన్నా ఎక్కువ, ఇతను నా ఇంటర్​ప్రెటర్” అన్నారు. పైగా పుస్తకం లోపలి పేజీ మీద ‘టు మై ఇంటర్ ప్రెటర్ అండ్ కొలీగ్, శ్రీ కల్లూరి భాస్కరం’ అని రాసి సంతకం చేసి ఇచ్చారు. ‘ఇన్ సైడర్’ రెండవ భాగాన్ని కూడా ఇతనే అనువాదం చేస్తాడని విజయవాడ సభలో ప్రకటించారు. 650 పేజీలు రాసి, పుస్తకం పూర్తి కాకుండానే దురదృష్టవశాత్తూ ఆయన కన్నుమూశారు.

ఆయన జ్ఞాపకశక్తి ఆశ్చర్యం కలిగించేది

అనువాద పద్ధతి మీద ఆయనకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి. కలిసినప్పుడు వాటిని వివరించేవారు. సాధారణంగా ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసేటప్పుడు అందులో తెలుగుతనాన్ని, తెలుగు నుడికారాన్ని తేవాలని అనుకుంటాం. ఇంగ్లీష్ సామెతలను కానీ, నుడికారాన్ని కానీ తెలుగు సామెతల్లోకి, నుడికారంలోకి మార్చాలనుకుంటాం. పీవీగారు అది సరికాదని, ఇంగ్లీష్ సామెతల్ని, నుడికారాన్ని ఉన్నదున్నట్టు అనువదించాలని అనేవారు. అప్పుడే తెలుగులో పదసంపద, వ్యక్తీకరణ శక్తి పెరుగుతాయని అనేవారు. ఆయన జ్ఞాపకశక్తి ఆశ్చర్యం కలిగించేది. ఆయనది కంప్యూటర్ మెదడు అనిపించేది. ఒకసారి ‘లోపలి మనిషి’ ప్రూఫులు చూసి మాకు పంపేసి అమెరికా వెళ్లారు. ఒకరోజున అక్కడినుంచి ఫోన్ చేసి, మీకు తిప్పి పంపిన అధ్యాయాల్లో ఫలానా అధ్యాయంలో, పేజీలో, పేరాలో, ఫలానా మాట బదులు ఫలానా మాట ఉంటే బాగుంటుందని సూచించారు. అంటే అమెరికా వెళ్ళేవరకూ ఆ మాట గురించే ఆయన ఆలోచిస్తున్నారన్నమాట. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, అప్పటికి నెలరోజుల క్రితం కలిసినప్పుడు ఏ సబ్జెక్టులో ఎక్కడ సంభాషణ ఆగిందో, నెలరోజుల తర్వాత తిరిగి సరిగ్గా ఆ సబ్జెక్టులో అక్కడినుంచి సంభాషణ ఎత్తుకునేవారు. ఆయన మెదడులో ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క అర ఉన్నట్టు అనిపించేది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాజీ ప్రధానితో మాట్లాడుతున్నట్టు అనిపించేది కాదు. ఆయన మాటల్లో చక్కని తెలంగాణ నుడికారం చెవులకు విందు చేసేది. తన సెక్రెటరీగా ఉన్న పాండే అనే ఆయనతో, “పాండేజీ జర చాయ్ తాపించండి” అనేవారు. చాయ్ వచ్చిన తర్వాత, లాల్చీ జేబులోంచి బాటిల్ తీసి షుగర్ పిల్స్ వేసుకునేవారు. చాలా విషయాల మీద సంభాషణ దొర్లేది. రాజకీయాలు, సాహిత్య విషయాలే కాక, వ్యక్తిగత విషయాలు కూడా అందులో ఉండేవి. లోపలి మనిషి రెండవ భాగమే కాక, వివిధ సందర్భాలలో తను చేసిన ప్రసంగాలను కూడా అనువదింపచేయాలనే ఆలోచన ఆయన చేస్తుండేవారు. కానీ ఆయన కన్నుమూతతో ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

ఆయనకు శతజయంతి వందనాలు!
కల్లూరి భాస్కరం, సీనియర్ ఎడిటర్, పీవీ ‘ఇన్ సైడర్’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సాహితీవేత్త.

Latest Updates