చైనా ఓపెన్: మొదటి రౌండ్‌లో సింధు ఓటమి

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది.  చైనాలోని ఫుజౌలో జరుగనున్న చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీ తొలి రౌండ్‌లో ఓడిపోయిన సింధు ఇంటిదారి పట్టింది. చైనా ఓపెన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భాగంగా ఇవాళ(మంగళవారం) జరిగిన మొదటి రౌండ్‌లో 13-21, 21-18, 19-21తో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ) చేతిలో సింధు ఓడిపోయింది.

74 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 42 అయిన పాయ్‌ యు పో చేతిలో ఆరో సీడ్‌ సింధు ఓడిపోయింది. చైనీస్‌ తైపీ తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకుంది. సింధు చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నీతోపాటు కొరియా ఓపెన్, డెన్మార్క్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీల్లో పాల్గొంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన సింధు.. మిగతా మూడు టోర్నీల్లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయింది. చైనా ఓపెన్‌లోనూ సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

మరోవైపు సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్‌లో చైనా ప్లేయర్‌ కాయ్‌ యాన్‌ యాన్‌తో తలపడుతుంది. తొలి రౌండ్‌లో గెలిస్తే సైనాకు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) లేదా లైన్‌ జార్స్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌) ఎదురయ్యే చాన్స్‌ ఉంది. ఈ రౌండ్‌నూ దాటితే క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌) రూపంలో సైనాకు కఠిన ప్రత్యర్థి ఉండే అవకాశముంది.

సాత్విక్‌-అశ్విని జోడి కెనడాకు చెందిన జాషువా హర్ల్‌బర్ట్ యు, జోసెఫిన్ వులను 21-19 21-19 తేడాతో ఓడించి ముందంజ వేశారు.

Latest Updates