ఆంధ్రా వాటర్ లో క్వాలిటీ లేదట: కేటగిరీ ‘సీ’లోనే నది నీళ్లు

ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీసీబీ) సీ కేటగిరీ రేటింగ్ ఇచ్చింది. అంటే నీళ్ల నాణ్యత చాలా తక్కువగా ఉందని అర్థం. పొరపాటున ‘కేటగిరీ డీ’కి క్వాలిటీ పడిపోతే, ఆ నీళ్లిక తాగడానికి పనికిరావు. గతేడాది కూడా నదుల నీళ్లకు సీ రేటింగ్ వచ్చింది. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యులన్(ఎన్జీటీ) ఏపీ సర్కారును ఆదేశించింది. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా.. ఏపీ సర్కారు నదుల వైపు కనీసం తిరిగి కూడా చూడలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పీహెచ్, ఆక్సిజన్, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కొలిఫార్మ్, టోటల్ డిసాల్వ్ డ్ సాలిడ్స్(టీడీఎస్) ను ఏపీపీసీబీ పరీక్షించింది. వీటిలో నీళ్ల నాణ్యత ఇంకా ‘సీ కేటగిరీ’లోనే ఉన్నట్లు ఆఫీసర్లు నిర్ధారించారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) రూల్స్ ప్రకారం.. ఓ నదిలోని నీళ్లలో ఎలాంటి ఇన్ ఫెక్షన్ లేకపోతే ‘కేటగిరీ ఏ’గానూ, స్నానం చేయగలిగే నీళ్లయితే ‘కేటగిరీ బీ’, శుభ్రం చేసి తాగగలిగితే ‘కేటగిరీ సీ’గా, కేవలం అటవీ జంతువులు తాగగలిగినవైతే ‘కేటగిరీ డీ’గా, పరిశ్రమల్లో వాడటానికి పనికొచ్చేవైతే ‘కేటగిరీ ఈ’గా గుర్తిస్తారు. ‘కేటగిరీ ఏ’ నీళ్లను శుభ్రం చేయాల్సిన పని లేకుండా డైరెక్టుగా తాగేయొచ్చు.

కృష్ణ కంటే గోదారే నయం..

పోలవరం, కుమార దేవం, ధవళేశ్వరం, నల్లా చానెల్ నుంచి గోదావరి నీళ్లను శాంపిల్స్ గా తీసుకుని ఏపీపీసీబీ టెస్టులు చేసింది. ఈ నీళ్ల పీహెచ్ విలువ 7.1 నుంచి 7.5గా ఉండగా, ఆక్సిజన్ పాళ్లు 5.1 నుంచి 8, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 1 నుంచి 2, కొలిఫాం కౌంట్ 75 నుంచి 210, టీడీఎస్ 124 నుంచి 204గా ఉన్నట్లు తేలింది. సంగమేశ్వరం, శ్రీశైలం, వేదాద్రి, అమరావతి, ప్రకాశం బ్యారేజ్, హంసలదీవి వద్ద కృష్ణా నీళ్లను శాంపిల్స్ గా తీసుకున్నారు. వీటిలో గోదావరితో పోల్చితే కోలిఫాం బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని తేలింది. 100 ఎంఎల్ నీళ్లలో 1600లకుపైగా కోలిఫాం బ్యాక్టీరియా కౌంట్ ఉంది.

Latest Updates