సీఎం రివ్యూ తర్వాత యాదాద్రిలో కట్టింది క్యూలైన్లే

రెండు నెలల్లో యాదాద్రి పనుల ప్రోగ్రెస్ ​ఇదీ

మౌలిక వసతుల ముచ్చటే లేదు

పరిహారం తేలక నిలిచిన రింగ్​రోడ్డు పనులు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి టెంపుల్​పనుల్లో వేగం పెంచాలి. మరో రెండు మూడు నెలల్లో గుడిని ప్రారంభించుకునే దిశగా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలంటూ 7 నవంబర్ 2020న ప్రగతిభవన్​లో జరిపిన రివ్యూలో సీఎం కేసీఆర్ అన్నారు. ఆ మర్నాడే రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​యాదాద్రికి వచ్చి పరిశీలించారు. కొత్తగా ఆర్టీసీ బస్టాండ్, బస్ డిపో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. సీఎం రివ్యూ, మంత్రుల పర్యటన జరిగి రెండు నెలలు గడిచింది.  ఈ రివ్యూలో మూడు నెలల్లోనే టెంపుల్ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. రెండు నెలలైతే గడిచిపోయాయి. అప్పటికీ.. ఇప్పటికీ.. యాదాద్రి టెంపుల్ పనుల్లో పెద్దగా తేడా లేదు. రివ్యూ జరిగిన తర్వాత నర్సింహుడి గర్భగుడిలో క్యూ లైన్ల ఏర్పాటు జరిగింది. టెంపుల్ చుట్టూరా అప్పటివరకు అసంపూర్తిగా ఉన్న ఫ్లోరింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి. లడ్డూ తయారీ కేంద్రం పూర్తి కావస్తోంది.  రెండు నెలల క్రితం ఏవైతే పనులు పెండింగ్​లో ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి.  సీఎం కేసీఆర్ చెప్పిన మూడు నెలల గడువులో ఇంకా నెల రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల రోజుల్లో పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి కావడం అసాధ్యం. అందుకే మరో  మూడు నెలలు  టైం కావాలని సీఎంను వైటీడీఏ ఆఫీసర్లు కోరినట్టు తెలుస్తోంది. మార్చిలో నిర్వహించే  బ్రహ్మోత్సవాల నాటికి ప్రారంభం చేయాలని అనుకున్నా.. ఎంతో స్పీడుగా చేస్తే తప్ప ఈ పనులు పూర్తి కావు.

ఐదేండ్లుగా కొనసాగుతూనే..

కేసీఆర్ సీఎంగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత యాదగిరిగుట్టలోని  లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్​మెంట్ అథారిటీ(వైటీడీఏ) ఏర్పాటు చేసి రూ. 1,200 కోట్లు కేటాయించారు. టెంపుల్ పునర్నిర్మాణ  పనులు ప్రారంభించి  ఐదేండ్లు కావస్తోంది. దాదాపు 13 సార్లు సీఎం కేసీఆర్ యాదాద్రి వచ్చి వెళ్లారు. టెంపుల్ పునర్నిర్మాణం 90 శాతం ముగిసిందని గడిచిన ఆరు నెలలుగా వైటీడీఏ ఆఫీసర్లు చెబుతూనే ఉన్నారు. మిగిలిన 10 శాతం పనులు మాత్రం పూర్తి కావడం లేదు.

పెండింగ్​లో పనులు

గర్భగుడితో పాటు తూర్పు, పశ్చిమ  రాజగోపురాలతో పాటు మిగిలిన గోపురాల ఫినిషింగ్ పనులు ఇంకా కాలేదు. గర్భగుడిలో లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. అనుబంధ శివాలయంలో  పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇంకా ఫ్లోరింగ్ పనులు నడుస్తున్నాయి. గుడి పనులు మొత్తం కృష్ణ శిలతో చేస్తామని చెప్పినా.. కొన్ని నిర్మాణాలు ఇటుకలతో చేస్తున్నారు. కొండపై108 అడుగుల  ఆంజనేయుడి విగ్రహం ప్రతిష్ఠిస్తామని చెప్పిన వైటీడీఏ ఆఫీసర్లు ఇప్పుడు ఏకశిల దొరకడం లేదని అంటున్నారు. ప్రసాదం కౌంటర్ నుంచి గర్భాలయం వద్దకు వెళ్లే రోడ్డు అలానే ఉంది. రిటర్నింగ్ వాల్ పూర్తి కాలేదు. మూడో అంతస్తు మినహా మిగిలిన వాటిల్లో క్యూ లైన్లు స్టార్ట్ చేయలేదు. గర్భాలయంలోకి భక్తులు వెళ్లడానికి ఇంకా క్యూ లైన్లు ఏర్పాటు చేయలేదు.  కొండ మీద నుంచి కిందకు రావడానికి ఘాట్ రోడ్డు పనులు కూడా పూర్తి కాలేదు. కొండపైకి మెట్లు అంసపూర్తిగానే ఉన్నాయి. కల్యాణకట్ట, అన్నదాన సత్రం పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి. కొండపైన బస్సులు నిలపడానికి ఇప్పటివరకు నిర్మాణం జరగలేదు. కొత్త బస్టాండ్, బస్​డిపో నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పినా.. ఇప్పటివరకు అక్కడ ఒక్క రాయి కూడా వేయలేదు.

అసంపూర్తిగా రింగ్ రోడ్డు 

కొండచుట్టూరా రింగ్ రోడ్డు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. రోడ్డు విస్తరణలో దుకాణాలు, ఇండ్లు కలిపి 170 వరకు పోతున్నాయి. వీటికి పరిహారం విషయం ఇంకా నిర్ణయం కాలేదు. ఇండ్ల స్థలాలు దూరంగా ఇస్తామని చెప్పడంతో నిర్వాసితులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో పట్టణం వరకు రోడ్డు పూర్తై ఆగిపోయింది.

మౌలిక వసతుల మాటే లేదు

యాదాద్రికి వస్తున్న భక్తులకు మౌలిక వసతులు లేవు. కొండ మీద, కొండ కింద ఎక్కడా టెంపుల్ తరఫున మౌలిక వసతులు కల్పించలేదు. కొండపైన పుష్కరిణిని కేవలం ఉత్సవమూర్తికే కేటాయించారు. భక్తుల కోసం కొండ కింద ఏర్పాటు చేస్తున్నారు. పాత పుష్కరిణి కూల్చివేసిన తర్వాత ఇప్పటివరకు కొండపై నల్లాల వద్ద భక్తులు స్నానం చేసేవారు. ఇటీవలే అవి కూడా తొలగించారు. దీంతో భక్తులు స్నానం చేయడం, ఇతర అవసరాలకు చోటు లేకుండా పోయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సులభ్​కాంప్లెక్స్ రేకుల షెడ్డులో భక్తులు స్నానం చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. కొండ కింద పుష్కరిణి పూర్తి అయితే తప్ప ఈ సమస్య తీరదు.

For More News..

వేరే రాష్ట్రాల్లో వడ్ల కేంద్రాలు చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

స్మార్ట్ సిటీ ఫండ్స్​తో రాష్ట్ర సర్కారు దొంగాట

మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ తయారుచేసిస్తామంటున్న ఇండియన్ మొబైల్ కంపెనీ

Latest Updates