సీఎం కేబినెట్ లోనే చదువు రాని ముగ్గురు మినిస్టర్లు ఉండటం సిగ్గు చేటు

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంట్రాక్టుల మీద, కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల మీద లేదన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. గురువారం ఆయన నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యా శాఖ డైరక్టరేట్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణయ్య.. 40 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలనీ…టెట్ వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, ప్రతి పక్షాలు  ఎన్ని ధర్నాలు  చేసినా.. దున్నపోతు మీద వాన పడ్డట్టు, ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటు అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి…తక్షణమే నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు.

కర్ణాటక &  కేరళ రాష్ట్రాలలో ఏడాదికి ఒక్క DSC వేస్తారని, ఏపీలో కూడా గత 6 సం.లలో 3 సార్లు DSC వేశారని …సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రాలను చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. చివరికి పేద రాష్ట్రమైన బీహార్ లోనూ నియామక ప్రక్రియ సక్రమంగా ఉందన్నారు. ధనిక  రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేబినెట్ లోనే చదువు రాని ముగ్గురు మినిస్టర్లు ఉండటం సిగ్గు చేటు అన్నారు. ప్రభుత్వం వెంటనే నియామక ప్రక్రియ చేపట్టకపోతే వేలాది మంది నిరుద్యోగులతో ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని హెచ్చరించారు ఆర్.కృష్ణయ్య. పాఠశాల విద్యాశాఖ డైరక్టరేట్ ఆఫీసును ముట్టడికి నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.

Latest Updates