నాచారంలో దోపిడీకి పాల్ప‌డిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్: ఈనెల 19 తేదీన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగిన ఓ దోపిడి కేసుకు సంబంధించి పోలీసులు మ‌రో ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న వృద్ధురాలకు మత్తు మందు ఇచ్చి, ఈ దోపిడీకి పాల్ప‌డిన నేపాలీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ మీడియాకు తెలిపారు. ఇంట్లో పని చేసే మనుషులుగా చేరిన ఈ గ్యాంగ్ అదును చూసి దోపిడీ చేశార‌ని, మొత్తం 25 టీమ్స్ తో ఐదుగురిని అరెస్ట్ చేశామని అన్నారు.

నాచారం హెచ్ఎంటీ న‌గ‌ర్ వాసి ప్ర‌దీప్ కుమార్.. త‌న ఇంట్లో పని చేయడానికి నేపాలీ దేశానికి చెందిన వారే కావాల‌ని త‌న ఫ్రెండ్ పురుషోత్తం కి చెప్పాడు. దీంతో పురుషోత్తం త‌న డ్రైవర్ రాజు సహాయం తో ఓ సెక్యురిటి ఏజెన్సీ ద్వార మాయ, అర్జున్ ని ప్రదీప్ ఇంట్లో పని మనుషులుగా కుదిర్చారు. తామిద్ద‌రం భార్యాభ‌ర్త‌ల‌మ‌ని చెప్పి వారు ప్ర‌దీప్ కుమార్‌ను నమ్మించారు. ఈ నెల 19వ తేదీన ప్ర‌దీప్ కుమార్‌, త‌న కుమారుడు ఆఫీస్‌కు.. అత‌ని భార్య‌, కూతురు క‌లిసి మెద‌క్ లో ఓ ఫంక్ష‌న్‌కు వెళ్లారు. ఇదే అదనుగా భావించి అర్జున్ , మాయ తో పాటు మరో ఇద్దరు క‌లిసి ప్ర‌దీప్ త‌ల్లి(70)కి మ‌త్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న 10 లక్షల నగదు, 9 తులాల బంగారం, రిస్ట్ వాచ్‌తో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువుల ‌ను దొంగిలించారు.

ఆ రోజు రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌దీప్ ఇంటికి రాగా, త‌ల్లి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆయ‌న నాచారం పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ప్ర‌దీప్ ఫిర్యాదు మేర‌కు నాచారం పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మొత్తం 8 మంది ఉన్న ఈ గ్యాంగ్ లో ఐదుగురిని అరెస్ట్ చేశామ‌ని, ముగ్గరు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. సరైన బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా నేపాలీ వాళ్ళను సెక్యురిటి గా రిక్రూట్ చేస్తే ఏజెన్సీ ల పై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని క‌మిష‌నర్ తెలిపారు

Latest Updates