హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్..ఆకతాయిల అరెస్ట్

హైదరాబాద్,వెలుగు:బొమ్మల రామారం ఘటనలతో రాచకొండ పోలీసులు అలెర్ట్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న కమిషనరేట్ పరిధిలో ఈవ్ టీజర్లపై నిఘా పెట్టారు. శివారు ప్రాంతాల్లో మహిళా రక్షణ కోసం పటిష్టమైన ప్రణాళికలు రూపొందించారు. షీ టీమ్స్ తో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు.  నెల రోజుల నుంచి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 53 కేసులు నమోదు చేసి 38 మంది ఈవ్ టీజర్లను అరెస్ట్ చేశారు. ఇందులో 33 ఎఫ్ఐఆర్ లు,16 పెటీ కేసులతోపాటుమరో 4 కేసుల్లో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులుకు చిక్కిన 38 మందిలో 33 మేజర్లు కాగ ఐదుగురు మైనర్లు ఉన్నారు. ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ చెప్పారు.

నేరేడ్ మెట్ లో

నేరెడ్ మెట్ లో  ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (24)ను వేధిస్తున్న టి. సాంబశివరావు(43)ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఫాలో చేస్తూ గత నెల 27న ఆఫీస్ కు వెళ్తున్న యువతిని వెంబడించాడు. ‘‘ ఐ లైక్ యూ సో మచ్’’ అంటూ మెసేజ్ లు పంపుతూ వేధించాడు. గతంలో అనేకసార్లు తల్లిదండ్రులు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

ట్రాక్టర్ డ్రైవర్ వేధింపులు

భువనగిరిలో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని సింగన్న గూడెం గ్రామానికి చెందిన బొంతుల రామకృష్ణ(20) వేధించాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న అతను ఆరు నెళ్లుగా ప్రేమ పేరుతో వెంబడించేవాడు. గత నెల 4న కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న ఆమెను వెంబడిస్తూ తనను ప్రేమించాలని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల సాయంతో భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

డెకాయ్ ఆపరేషన్లు

భువనగిరి టౌన్, ఇబ్రహీం పట్నం, మల్కాజ్​గిరిలో షీటీమ్స్ ఆధ్వర్యంలో డెకాయ్ ఆపరేషన్స్​నిర్వహించారు. ఇందులో భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద ఈవ్ టీజింగ్ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్కూల్ కి వెళ్లే వాళ్లను వేధిస్తున్నారన్న సమాచారంతో షీ టీమ్స్ ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో పిట్టల సందీప్(18), గూడ సాయికుమార్(19), జెర్రిపోతుల శ్రవణ్ ను పట్టుకున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్​ఇచ్చారు.

టెన్త్ పరీక్షలకు వస్తే

ఇబ్రహింపట్నం మంచాలలో ఇద్దరిని అరెస్ట్ చేసింది షీ టీమ్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఇద్దరు యువకులు వేధించారు. అప్పటికే ఎగ్జామ్ సెంటర్ వద్ద నిఘా పెట్టిన షీ టీమ్ పోలీసులు పంతంగి చందు(19), కామశెట్టి శ్రీను(20) లను పట్టుకున్నారు. స్కూల్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై పెటీ కేసు నమోదు చేసి కౌన్సెలింగ్​ఇచ్చారు. మల్కాజ్​గిరిలో  14 ఏళ్ల బాలికను వేధిస్తున్న 15 ఏళ్ల బాలున్ని డెకాయ్ ఆపరేషన్ తో షీ టీమ్స్ అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత తల్లిదండ్రులు, స్వస్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్​నిర్వహించి హెచ్చరించింది.

మాకు చెప్పండి

విద్యాసంస్థలు, బస్ స్టాపులు, ఆఫీసులు ఎక్కడైనా సరే వేధింపులకు గురయ్యేవారు తమకు సమాచారం ఇవ్వాలని రాచకొండ పోలీస్​కమిషనర్​మహేష్ భగవత్ సూచించారు. శ్రావణి ఉదంతంతో గ్రామాల్లో  నిఘా పెంచినట్టు చెప్పారు. ఆపదలో ఉన్న వారు 100తోపాటు 94906 17111 కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ లో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

 

Latest Updates