నయనతారపై విమర్శలు.. డీఎంకే నుంచి రాధారవి సస్పెన్షన్

లేడీ సూపర్ స్టార్ నయనతారను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ సినీ నటుడు, డీఎంకే నాయకుడు రాధారవిపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. నయనతార వేస్తున్న పాత్రలు.. మీ టూ ఇష్యుపై రాధారవి వ్యాఖ్యలు కొద్దిరోజులుగా తమిళ ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.

రాధారవి ఏమన్నాడంటే..?

నయనతార నటించిన కొలైయుదిర్ కాలమ్ సినిమా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ కు హాజరైన రాధారవి.. నయనతార చేసే పాత్రలపై స్పందించారు. “నయనతార ఓసారి సీత పాత్ర, మరోసారి దెయ్యం పాత్ర ఇలా.. రకరకాల పాత్రలు చేస్తోంది. దేవతల పాత్రలు ఒకప్పుడు కేఆర్ విజయ లాంటివాళ్లు వేసేవాళ్లు. దేవత పాత్ర చేసినవాళ్లు కనపడినా వారికి దండం పెట్టేలా వాళ్ల వ్యక్తిత్వాలు ఉండేవి. కానీ ఇప్పుడు అందరూ వేస్తున్నారు. ఎవరెవరితోనే తిరిగేవాళ్లు  చేస్తున్నారు. నయనతార నిజంగా లేడీ సూపర్ స్టార్ లాంటి నటినే. అందులో డౌటేం లేదు. కానీ ఆమెను పెద్దపెద్ద నటులతో పోల్చొద్దు. నయనతారను చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి” అని అన్నాడు.

మీ టూ పైనా నోరుపారేసుకున్న రాధారవి

సినిమా నిర్మాణ సమయంలోనే నిర్మాతలు కొన్ని సూచనలు పాటించాలని రాధారవి అన్నాడు. సినిమాకోసం తీసుకునే హీరోయిన్, ఫిమేల్ ఆర్టిస్టులను హీరో ఎక్కడెక్కడ తాకుతాడో అన్నదానిపై ముందే రాతపూర్వకంగా హామీ తీసుకోవాలని… ఆ తర్వాత హీరోయిన్లతో గొడవలు రావని.. అన్నాడు.

లెటర్ తో నయనతార ఘాటు రిప్లై

రాధారవి చేసిన కామెంట్స్ ను తప్పుపడుతూ రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు నయనతార. చేసే పాత్రలే కనపడాలని తపించే మనస్తత్వం నాది. ఏ పాత్ర చేసినా.. నటి కనిపించకూడదనేదే తన ఉద్దేశమని చెప్పారు. మహిళా నటీనటులను అవమానించిన రాధారవిపై చర్యలకు నయన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారికి పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదని డీఎంకేకు సూచించారు.

రాధారవిని డీఎంకే నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె స్టాలిన్ కు థాంక్స్ చెప్పారు.

కోలీవుడ్ లో దుమారం

రాధారవి చేసిన వ్యాఖ్యలను నడిగర్ సంఘం, కోలీవుడ్ సినీ ప్రముఖులు తప్పుపట్టారు. ఇలా మాట్లాడినవాళ్లపై సినీ పెద్దల సంఘం ఎందుకు కఠిన చర్య తీసుకోదో అర్థం కాదని దర్శకుడు విఘ్నేష్ శివన్ అన్నారు. స్త్రీలను చులకనగా చూసేవారికి తన సినిమాల్లో స్థానం లేదని దర్శకుడు మిలింద్ రావ్ చెప్పారు. స్త్రీలను గౌరవిస్తామని సినిమా సంఘాలు డైలాగులు మాత్రమే చెబుతాయని.. యాక్షన్ ఎందుకు తీసుకోవని వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రశ్నించారు. రాధారవి కామెంట్స్ పై ఆమె సోదరి, ప్రముఖ నటి రాధిక స్పందించారు. నయనతార డెడికేషన్ ఉన్న నటి అనీ… ఆమె గురించి తప్పుగా మాట్లాడావని రాధారవికి చెప్పిన సంగతి గుర్తుచేశారు.

Latest Updates