పాత నేతకు ప్రాణం పోసిన సురయ్యా హాసన్‌‌ బోస్‌‌

పర్షియన్‌‌ నుంచి వచ్చిన డిజైన్‌‌ నిజాం కాలంలో రెండు వందల ఏళ్లు ఒక వెలుగు వెలిగింది. అప్పుడు హింబ్రు చేనేతలకు చేతినిండా పనే. స్వాతంత్ర్యం వచ్చినంక హింబ్రు, మష్రో వంటి తరతరాల నుంచి వస్తున్న గొప్ప చేనేత కళాకృతులు మరుగున పడ్డయ్‌‌.1972లో సురయ్యా హాసన్‌‌ బోస్‌‌ మరుగున పడ్డ ఆ చేనేత వస్త్రాలకు తిరిగి కొత్త రంగులద్దింది సురయ్యా. కాదు కాదు మళ్లీ ప్రాణం పోసింది! దేశ వస్త్రపరిశ్రమ చరిత్రలో  లెజెండ్‌‌గా నిలిచిన ఆమె మన హైదరాబాదీ! ‘ఇంత గొప్ప వ్యక్తి  గురించి ప్రపంచానికి తెల్వకపోవడమేంది?’ అని ఇటీవల రైటర్‌‌‌‌ రాధికాసింగ్‌‌ ‘సురయ్యా హాసన్‌‌ బోస్‌‌..వేవింగ్‌‌ ఏ లెగసీ’ అనే పుస్తకం రాసింది. సురయ్యా గురించి మనం కూడా తెలుసుకుందాం..

ఫ్యాబ్‌‌ ఇండియాలో ఏం వెతికినా సురయ్యా పేరుతో ఉన్న డిజైన్స్‌‌ ఉండటాన్ని చూసింది రాధికాసింగ్‌‌.  ‘ అసలు ఎవరీ బోస్‌‌’ అని ఫ్యాబ్‌‌ ఇండియా ఫౌండర్‌‌‌‌ జాన్‌‌ బిస్సెల్‌‌కు లేఖ రాసిందామె. అందుకాయన బోస్‌‌ గురించి,  ఆమె రియాక్ట్‌‌  అయ్యే విధానం గురించి చెప్తూ ఆమెను అతనెంత గౌరవిస్తాడో వివరంగా చెప్పిండు.  వస్త్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవల్నీ పంచుకున్నడు.  ఇదంతా విన్నంక రాధికాసింగ్‌‌కి  బోస్‌‌ గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అలా మొదలైన ఆమె ఆలోచన ఆమె మీద పరిశోధన చేసేదాంక పోయింది. ‘మరుగున పడ్డ చేనేత కళారూపాలను పునరుద్ధరించిందామె.

ఎవరీ బోస్‌‌?

పేరులో బోస్‌‌ ఉంది. సుభాశ్‌‌చంద్రబోస్‌‌ ఫ్యామిలీనా? అనే డౌట్‌‌వస్తుందా? నిజమే ఆమెది బోస్‌‌ఫ్యామిలీనే. సుభాశ్‌‌ చంద్రబోస్‌‌ అన్న కొడుకు అరవింద్‌‌బోస్‌‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందామె. ‘బోస్‌‌  బెంగాలీ. సంప్రదాయ హిందూ కుటుంబం. కోడలిగా ఒక ముస్లిం అమ్మాయి ఇంట్లో అడుగుపెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్న.. కానీ వాళ్లు ప్రేమగా చూసుకున్నరు’ అని గుర్తు చేసుకుంది బోస్‌‌. సురయ్యా కుటుంబం 1874లో  ఉత్తరప్రదేశ్‌‌ నుంచి హైదరాబాద్‌‌కి వచ్చింది. సురయ్యా 1928లో హైదరాబాద్‌‌లో పుట్టింది.  అప్పట్లోనే  తండ్రి బద్రూల్‌‌ హాసన్‌‌ ‘హైదరాబాద్‌‌ బుక్‌‌ డిపో’ ఓపెన్‌‌  చేసిండు.  హైదరాబాద్‌‌లోనే మొదటి వస్త్ర కుటీర పరిశ్రమను స్థాపించింది కూడా బద్రూల్‌‌ హసనే.  సురయ్యా చిన్నాన్న యాబిద్ హుస్సేన్ సఫ్రానీ చంద్రబోస్‌‌కి పర్సనల్ సెక్రటరీ. ఆయన వల్లే అరవింద్‌‌ పరిచయమైండు.

వస్త్ర పరిశ్రమ వైపు

సురయ్యా చిన్నగున్నప్పుడే తండ్రి చనిపోయిండు. పదో తరగతి పూర్తికాగానే తండ్రి స్థాపించిన కుటీర వస్త్ర పరిశ్రమలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే కోఠి ఉమెన్స్‌‌ కాలేజీలో ఇంటర్‌‌‌‌ పూర్తి చేసింది. నాలుగేళ్ల తర్వాత  ఢిల్లీలో  హ్యాండ్లూమ్‌‌ అండ్‌‌ హ్యాండిక్రాఫ్ట్స్‌‌ ఎక్స్‌‌పోర్ట్‌‌ కార్పొరేషన్‌‌లో ఉద్యోగం చేసింది.  ఆ పదేళ్లలో.. భారత వస్త్ర పరిశ్రమలో గొప్ప వ్యక్తులుగా చెప్పుకునే.. మార్తాండ్‌‌ సింగ్‌‌, లక్ష్మీ జైన్‌‌, కమలాదేవి ఛటోపాధ్యాయతో పని చేసింది. దీంతో టెక్స్‌‌టైల్‌‌ గురించి పూర్తిగా అర్థం చేసుకోగలిగింది. మరోవైపు,  ఢిల్లీలోనే అరవింద్‌‌తో పరిచయం అయింది. ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు.  ‘మాకు పిల్లలు లేరు. పెళ్లయిన పదేళ్లకే  అరవింద్‌‌బోస్ గుండెపోటుతో చనిపోయిండు. అప్పుడు మా చిన్నాన్న ఉద్యోగం వదిలేసి నన్ను తీసుకుని హైదరాబాద్‌‌ వచ్చిండు. ఇక్కడ టోలిచౌకిలో పదెకరాల పొలం కొనిచ్చిండు. అక్కడే కుటీర పరిశ్రమ స్థాపించిన’ అని గుర్తు చేసుకుంది బోస్‌‌.  నిజాం కాలంనాటి వస్త్ర తయారీకి వేదికైన ఈ పరిశ్రమలో భర్తను పోగొట్టుకున్న మహిళలకు ఉపాధి కల్పిస్తుందామె.  పక్కనే వాళ్ల చిన్నాన్న పేరుతో ‘సఫ్రానీ మెమోరియల్ స్కూల్’ని స్థాపించి ఆమె చేనేత కేంద్రంలో పనిచేసే కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్‌‌ మీడియంలో చదువు చెప్పిస్తోంది.

హైదరాబాద్‌‌లో పరిశోధన

స్వాతంత్ర్యం వచ్చినంక నిజాం కాలం నాటి చేనేత పరిశ్రమలన్నీ మరుగునవడ్డయ్‌‌.   ‘హింబ్రు’ మరుగున పడిపోతున్న సమయంలో  బోస్‌‌ హైదరాబాద్‌‌కి వచ్చి  హింబ్రు వస్త్రాల కోసం బోస్‌‌ అన్వేషణ ప్రారంభించింది. వాటికోసం  ఓల్డ్‌‌సిటీ మొత్తం వెతికింది. కానీ,  కరాబైన కొన్ని షేర్వాని ముక్కలు దొరికినయ్‌‌ ఆమెకు.  ఔరంగాబాద్‌‌లో ఉన్న చేనేత కుటుంబం నుంచి పాత హింబ్రూ డిజైన్స్ బ్లూ ప్రింట్స్‌‌ కొనుక్కొచ్చింది.  వాటిలో ట్రెడిషనల్ డిజైన్స్‌‌ని గుర్తించింది. తర్వాత వాటిని  జాగ్రత్తగా  ప్రయోగపూర్వకంగా తయారు చెయ్యడం ప్రారంభించింది బోస్‌‌. దీనికి ఖాదిర్‌‌ ‌‌సాయం తీసుకుంది. ఎనిమిది పెడల్స్‌‌ మీద నేసే హింబ్రుని తయారు చెయ్యడం చాలా కష్టం. చూపు ఎనిమిది దారాలపై ఉంచాలి. ఈ క్రమంలోనే కనుమరుగై పోయిన మరో డిజైన్‌‌ మష్రోనే కూడా ఆమె గుర్తించింది. ఇలా నిజాం కాలం నాటి కళాకృతులకు మళ్లీ ప్రాణం పోసింది బోస్‌‌.

మళ్లీ మగ్గాలు మొగ్గలేసినయ్‌‌

ఎంత గొప్ప చరిత్ర ఉన్నా పాత డిజైన్లు ఎవరు తొడుగుతరు? అందుకే హింబ్రుకు కొత్త రంగులద్దింది బోస్‌‌. ఆమె మాస్టర్‌‌‌‌ చేనేతకారులతో పరిచయాలను పెంచుకుంది. వాళ్లకు రంగులను, డిజైన్‌‌లను ఇచ్చి దగ్గరుండి కొత్తగా తయారు చేయించింది. దీనికి ఆమె ఢిల్లీ అనుభవాలు బాగా ఉపయోగపడ్డయ్‌‌.  ‘ప్రాంతాన్ని బట్టి.. వస్త్రాన్ని ఎలా వాడాలి? ఎలాంటి రంగులు ఉపయోగించాలి? ఎన్ని దారాలు పెంచాలి. తగ్గించాలి’ అని తన నేసేటోళ్లకు చెప్పేది.  ఆమె నాయకత్వంలో ప్రత్యేకమైన ఉత్పత్తులు పుట్టుకొచ్చినయ్‌‌.  ఆమె కేవలం హింబ్రు, మష్రోతోనే ఆగిపోలేదు.  కొత్త డిజైన్లతో గద్వాల, ఉప్పాడ, మచిలీపట్నం చీరలకు గిరాకీ పెంచింది. దీంతో మగ్గాలు మళ్లీ మొగ్గలేసినయ్‌‌. ఇప్పటికీ చేనేత వస్త్ర ప్రేమికుల మనసులను గెలుచుకుంటున్నయ్‌‌. ఆమె నిబద్ధత వల్లే హింబ్రు, మష్రోలతో పాటు ఇతర చేనేతల జీవితాల్లో కూడా భద్రత పెరిగింది. ఇప్పటికీ ‘ఫ్యాబ్‌‌ ఇండియా’లో టాప్‌‌ ఎక్స్‌‌పోర్టర్‌‌‌‌ ఆమె!

అదే సురయ్యా గొప్పదనం

‘పాత వాటికి తిరిగి ప్రాణం పోయడమే బోస్‌‌ గొప్పదనం.  వారసత్వంగా వస్తోన్న కళాకృతులను బతికించిందామె.  చేనేతలో మన పురాతన సంస్కృతిని, కళని తిరిగిచ్చిందామె. అంతరించిపోయినయ్‌‌ అనుకున్న  హింబ్రు, మష్రోలను  తిరిగిచ్చిందామె.  ఇది వస్త్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే గొప్ప పని. ఆమె ఆలోచన, కమిట్‌‌మెంట్‌‌ వల్లే మన వారసత్వ సంపదను ముందు తరాలు చూడగలిగినయ్‌‌’ అని సింగ్‌‌ పుస్తకంలో వ్యాఖ్యానించింది.   ఆమె రూపొందించిన డిజైన్‌‌లు లండన్‌‌లోని విక్టోరియా, ఆల్బర్ట్‌‌ మ్యూజియంలో భద్రపరిచిన్రు.  వస్త్రపరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగాను ‘యుధ్‌‌వీర్’ అవార్డు కూడా అందుకుంది. వయసు  తొంభై ఏళ్లు దాటినా..  ఇప్పటికీ ఉత్సాహంగా పని చేస్తోంది బోస్‌‌. ఇప్పటికీ ఖాదీనే ధరిస్తుందామె. ఎంతో ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండటం ఆమె స్పెషాలిటీ. ఆమె గురించి పుస్తకం వచ్చేవరకు మనం మాట్లాడలేదు. కానీ.. ఆమె గురించి  ఆమె డిజైన్స్‌‌  ఎప్పటి నుంచో మాట్లాడుతున్నయ్‌‌. కుటీర వస్త్రపరిశ్రమ ఉన్నంత వరకు అవి మాట్లాడ్తనే ఉంటయ్‌‌!

‘దేశ వస్త్ర పరిశ్రమకు గొప్ప సేవలు అందించిన ఆమెపై ఒక్క పుస్తకం కూడా లేకపోవడంతో షాక్‌ కు గురయ్యాను’ అని
చెప్పింది రాధిక. బోస్‌ ప్రయాణాన్ని ఈ ప్రపంచానికి తానే పరిచయం చెయ్యాలనుకుంది . ‘సురయ్యా హాసన్‌
బోస్‌ ..  వేవింగ్‌ లెగసి’ అనే పుస్తకాన్ని రాసి మార్చిలో రిలీజ్ చేసింది. ఎవరూపట్టించుకోని ఒక లెజెండ్‌ కథని చెప్పింది రాధిక.