రిపబ్లిక్‌ డే వేడుకల్లో రఫేల్ యుద్ధ విమానం

భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్‌ యుద్ధ విమానం ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో మొదటి సారిగా సందడి చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో రఫేల్‌ యుద్ధ విమానం పాల్గొని ‘వర్టికల్‌ ఛార్లీ’ విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం(IAF)ఇవాళ( సోమవారం) తెలిపింది. వర్టికల్‌ ఛార్లీ ఫార్మేషన్‌లో యుద్ధవిమానం తక్కువ ఎత్తు నుంచి నిలువుగా ప్రయాణించి పైకి వెళ్తుంది. ఈ సారి గణతంత్ర వేడుకల్లో వాయుసేకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన నాలుగు విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నట్లు వింగ్‌ కమాండర్‌ ఇంద్రనీల్‌ నంది తెలిపారు.

ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్‌ 2016లో అగ్రిమెంట్ చేసుకుంది.మొదటి విడతలో భాగంగా ఐదు రఫేల్‌ విమానాలు గత నెల భారత్‌ చేరుకున్నాయి. సెప్టెంబరు 10న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలను లాంఛనంగా వైమానిక దళంలో చేర్చారు అధికారులు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో భాగంగా లద్దాఖ్‌లో ఉన్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వేడుకలను చూసే వారి సంఖ్యను తగ్గించడంతో పాటు భౌతిక దూరం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అంతేకాదు పరేడ్ దూరాన్ని కూడా తగ్గించినట్లు తెలుస్తోంది.

Latest Updates