మ్యారీ మీ.. ప్లీజ్!: ఎమ్మెల్యే అభ్యర్థికి డజన్ల కొద్దీ యువతుల ప్రపోజల్స్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ శనివారమే ఓటింగ్. పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సభలు, ఇంటింటి ప్రచారం, నియోజకవర్గంలో పాదయాత్రలు ఇలా రకరకాలుగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ అభ్యర్థికి ఊహించని రీతిలో స్పందన ఎదురువుతోంది. ఆ రెస్పాన్స్ ఎంత మేరకు ఓట్ల రూపంలోకి మారుతుందో ఏమో కానీ, ‘నిన్నే పెళ్లాడాలనుంది’ అంటూ ప్రపోజల్స్ జోరుగా వస్తున్నాయి. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ అభ్యర్థి అయిన 31 ఏళ్ల రాఘవ్ చద్దాకు పెళ్లి చేసుకుందామంటూ డజన్ల కొద్దీ యువతులు అడుగుతున్నారు.

ఢిల్లీలోని రాజిందర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున పోటీ చేస్తున్నారు రాఘవ్ చద్దా. సీఏ చదివిన ఆయన ఆమ్ ఆద్మీలో చేరి రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టిన కొన్నాళ్లకే పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆప్ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన తన నియోజకవర్గంతో పాటు ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్ ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేసి సోషల్ మీడియా వేదికగా కూడా సపోర్ట్ రాబట్టుకుంటున్నారు. అయితే ఆయన ఫొటోలు, వీడియోల కింది ఆయన్ని ట్యాగ్ చేస్తూ ‘పెళ్లి చేసుకుందాం’ అంటూ కొంతమంది యువతులు కామెంట్లు పెడుతున్నారు. వరుసగా ప్రపోజల్స్ వస్తున్నాయని రాఘవ్ సోషల్ మీడియా మేనేజర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

పెళ్లి చేసుకుందాం.. రైట్ టైమ్ కాదు

పెళ్లి చేసుకుందామంటూ.. లవ్ చేయాలని కోరుతూ రాఘవ్ చద్దా ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లలో ఫాలోయర్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల ఆయన్ని పెళ్లి చేసుకుంటానని ఓ యువతి కోరితే.. ‘ప్రస్తుతం ఎకానమీ మంచిగా లేదు. పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన టైం కాదు’ అని రాఘవ్ రిప్లై ఇచ్చినట్లు సోషల్ మీడియా మేనేజర్ చెప్పారు. 2015 నుంచి ప్రేమిస్తున్నానంటూ ఓ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేసింది. అలాగే మరో యువతి తన సోదరికి రాఘవ్ ఇన్‌స్పిరేషన్ అని, ఆయన్ని చూసి సీఏ చేరిందని, చదువు పూర్తయ్యాక సంబంధం మాట్లాడడానికి తన తండ్రిని పంపాలనుకుంటోందని చెప్పింది. మరి ఈ ప్రపోజల్స్‌తో వస్తున్న స్పందన మాదిరిగానే ఓట్లు వస్తాయో లేదో చూడాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న పోలింగ్, 11న కౌంటింగ్ జరగబోతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రాఘవ్‌కి వచ్చిన ప్రపోజల్స్‌లో కొన్ని..

Latest Updates