కాశ్మీర్​ వస్తా.. జనంతో మాట్లాడనిస్తరా?

గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​కు రాహుల్​ కౌంటర్​

న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లో టెన్షన్​పై ఆ రాష్ట్ర గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సెక్యూరిటీ బలగాల కట్టడిలోఉన్న కాశ్మీర్​లో హింస జరుగుతోందంటూ రాహుల్​ చేసిన కామెంట్లను గవర్నర్​ ఖండించారు. ‘‘రాహుల్​ గాంధీ లాంటి బాధ్యత గల వ్యక్తులు ఇలా మాట్లాడటం కరెక్ట్​ కాదు. ఏం జరుగుతోందో కాశ్మీర్​కే వచ్చి చూడాలి. ఆయన కోసం ఓ స్పెషల్​ ఫ్లైట్​ పంపుతా’’అని సోమవారం ఒక ప్రకటన చేశారు. దీనిపై రాహుల్ గాంధీ మంగళవారం ట్విటర్​లో స్పందించారు. ‘‘డియర్​ గవర్నర్​ మాలిక్​, మీ ఆహ్వానం మేరకు ప్రతిపక్ష నేతలతో కలిసి నేను కూడా జమ్మూ కాశ్మీర్​, లడక్​లో పర్యటిస్తా. మాకు స్పెషల్​ ఫ్లైట్​ వద్దుకానీ అక్కడి ప్రజల్ని, నాయకుల్ని, జవాన్లని కలుసుకునే ఫ్రీడం మాత్రం ఇస్తే చాలు”అని కౌంటరిచ్చారు. రాహుల్​ ట్విటర్​లో కామెంట్​ చేసిన కొద్దిసేపటికే గవర్నర్​ మాలిక్​ మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘రాహుల్​ ఆటలాడుతున్నారు. జమ్మూకాశ్మీర్​ అంటే ఆయనకు లెక్కలేదు. కాబట్టే అసలు సబ్జెక్ట్​ తెలియని బెంగాలీ లీడర్​(అధిర్​ చౌధురి)తో పార్లమెంట్​లో మాట్లాడించారు. పీఎం మోడీ ప్రకటనతో 90 శాతం కాశ్మీరీల్లో భయాందోళనలు తొలగిపోయాయి. కాశ్మీర్, లడక్​లో పెట్టుబడులకు అనిల్​ అంబానీ కూడా రెడీ అయ్యారు’’అని చెప్పుకొచ్చారు. కాశ్మీర్​లోకి ఇతర నాయకుల్ని అనుమతించే అంశాన్ని రాహుల్​ రాజకీయం చేస్తున్నారని, పొలిటికల్​ పర్యటనలతో ప్రశాంతతను చెడగొట్టాలనుకుంటున్నారని మాలిక్​ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలకు పర్మిషన్​ ఇవ్వాలా వద్దా అన్నది పోలీసులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

17న షా రాక.. ఆ తర్వాతే ప్రతిపక్షాలకు అనుమతి!

గవర్నర్​, రాహుల్​ మధ్య మాటల యుద్ధం తర్వాత కాశ్మీర్​ వ్యాలీలోకి ప్రతిపక్ష నేతలకు అనుమతిచ్చే అంశంపై కేంద్ర సర్కార్ దృష్టిసారించింది. దీనికి సంబంధించి లోకల్​ ఆఫీసర్ల నుంచి ఫీడ్​బ్యాక్​ తీసుకుంటున్నట్లు తెలిసింది. పోలీసుల ఆధీనంలో ఉన్న ఒమర్​ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీలను కూడా కలిసేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలా, వద్దా అనేదానిపై చర్చ జరుగుతున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆగస్టు 17 నుంచి లేహ్​ టౌన్​లో నేషనల్​ ట్రైబల్​ ఫెస్టివల్ జరుగనుందని, ఆ వేడుకలను కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రారంభిస్తారని, ఆయన పర్యటన పూర్తైన వెంటనే ప్రతిపక్ష నేతలను కాశ్మీర్​లోకి అనుమతించే అవకాశాలున్నాయని తెలిసింది.

2 నిమిషాలు మాట్లాడేందుకు.. 2 గంటలు వెయిటింగ్

శ్రీనగర్: రెండు నిమిషాలు ఫోన్​లో మాట్లాడేందుకు కాశ్మీరీ ప్రజలు రెండు గంటల పాటు లైన్​లో నిలుచుంటున్నారు. లోయ బయటున్న తమ బంధువులతో మాట్లాడేందుకు ఈ వెయిటింగ్​తప్పట్లేదని చెబుతున్నారు. కాశ్మీర్​స్పెషల్​స్టేటస్ రద్దు చేశాక ముందుజాగ్రత్త చర్యగా లోయలో మొబైల్, ఇంటర్నెట్​సేవలను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో బయటి ప్రపంచంతో సంబంధంలేకుండా పోయింది. అత్యవసరంగా కబురు పంపించాలన్నా వేచి ఉండక తప్పడంలేదు. ఆగస్టు 5 నుంచి ఫోన్​సర్వీసులపై ఆంక్షలు విధించగా.. సోమవారం నుంచి కొద్దిగా వెసులుబాటు కల్పించారు. డిప్యూటీ కమిషనర్​ఆఫీస్​ఆవరణలో పబ్లిక్​టెలిఫోన్​బూత్​లు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ జనాలు క్యూ కట్టారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్కరికీ రెండు నిమిషాలు మాట్లాడేందుకు అధికారులు అనుమతిచ్చారు. వెయిటింగ్​ముగిసి తమ వంతు వచ్చాక ఒకటీ అరా మాట్లాడేసరికి టైం అయిపోతోందని జనాలు చెబుతున్నారు.

Latest Updates