మళ్లీ కాంగ్రెస్​ చీఫ్​గా​ సోనియా గాంధీ

  • తాత్కాలిక ప్రెసిడెంట్​గా ప్రకటించిన వర్కింగ్​ కమిటీ
  • సుదీర్ఘంగా సాగిన సమావేశం
  • రాత్రి పదకొండు గంటలకు వెల్లడి
  • రాహుల్​గాంధీకి మరోసారి విజ్ఞప్తి
  • సున్నితంగా తోసిపుచ్చిన మాజీ చీఫ్
  • కాశ్మీర్లో ఏంజరుగుతుందో చెప్పాలి
  • ప్రధాని మోడీకి రాహుల్​ డిమాండ్

న్యూఢిల్లీ:కాంగ్రెస్​పార్టీ చీఫ్​గా మళ్లీ సోనియా గాంధీనే పగ్గాలు చేపట్టనున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చలో పార్టీ బాధ్యతలను తాత్కాలికంగా సోనియాకే అప్పగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. కొత్త సారథి ఎంపిక కోసం శనివారం కాంగ్రెస్​వర్కింగ్​కమిటీ భేటీ అయింది. రాహుల్​వారసుడి పేరును సాయంత్రంలోగా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా.. రాత్రి పొద్దుపోయే వరకూ సమావేశం కొనసాగింది. రాహులే కావాలని రాష్ట్రాల ప్రతినిధులు తేల్చిచెప్పడంతో సీడబ్ల్యూసీ ఎటూ నిర్ణయించలేకపోయింది. సీనియర్​ నేతలు మల్లికార్జున్​ఖర్గే, ముకుల్ ​వాస్నిక్​ తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. ఎంపిక విషయంలో రాత్రి పొద్దుపోయే వరకూ కమిటీ ఎటూ తేల్చలేదు. రెండు దఫాలుగా సాగిన మీటింగ్​ఏ ఫలితం తేలలేదు. రాత్రి పదిన్నర ప్రాంతంలో నేతల పిలుపుతో పార్టీ ఆఫీసుకు చేరుకున్న రాహుల్​గాంధీ.. పది నిమిషాల పాటు చర్చలో పాల్గొని బయటకొచ్చారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్​లో హింస చెలరేగిందనే రిపోర్టు అందడంతో సీడబ్ల్యూసీ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించలేదన్నారు. ఆ తర్వాత కాసేపటికే పార్టీ తాత్కాలిక చీఫ్​గా సోనియా గాంధీ వ్యవహరిస్తారనే ప్రకటన వెలువడింది.

ఉదయం నుంచే చర్చలు..

ఉదయం 9 గంటలకే పార్టీ పెద్దలు, సీడబ్ల్యూసీ నేతలు హెడ్​క్వార్టర్స్​కు చేరుకున్నారు. చీఫ్​గా ఎవరిని, ఎలా ఎన్నుకోవాలని చర్చించాక పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాలను కవర్ ​చేస్తూ సీనియర్​ నేతలతో ఐదు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ చీఫ్​పదవికి ఎవరైతే బాగుంటుందో రాష్ట్రాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఓవైపు ఈ ప్రాసెస్​నడుస్తుండగా.. కొత్త అధ్యక్షుడి ఎన్నికలో జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో సోనియా, రాహుల్‌ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. భారీ వర్షాలకు బాగా నష్టపోయిన సొంత నియోజకవర్గమైన కేరళలోని వాయనాడ్‌ కు వెళ్లాల్సి ఉన్నందువల్లే  మీటింగ్‌ మధ్యలోనే వచ్చినట్టు రాహు చెప్పారు. పార్టీ కొత్త చీఫ్‌ ఎంపిక కోసం ఏర్పాటుచేసిన ప్రాంతీయ కమిటీలో పొరపాటున తన  పేరు చేర్చారని సోనియా తెలిపారు. ప్రియాంక వాద్రా మాత్రం మీటింగ్​లోనే కూర్చున్నారు. కమిటీల ఎంపిక తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. రాత్రి 8:30 గంటలకు మరోసారి సమావేశమైంది. ప్రాంతీయ కమిటీల రిపోర్టులను పరిశీలించాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పార్టీకి రాహులే నాయకత్వం వహించాలని అన్ని కమిటీలు తేల్చిచెప్పాయి. దీంతో ఎటూ తేల్చలేక సీడబ్ల్యూసీ నేతలు రాహుల్‌కు ఫోన్​ చేశారు. రాత్రి పదిన్నర ప్రాంతంలో రాహుల్​పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. నేతల అభిప్రాయాలను రాహుల్​కు చెప్పి, పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని రాహుల్ సున్నితంగా తిరస్కరించారు. 10 నిమిషాలు నేతలతో మాట్లాడి బయటికొచ్చారు. కాంగ్రెస్ ​కొత్త చీఫ్ ​పేరును రాహుల్ ​ప్రకటిస్తారని నేతలు, మీడియా ప్రతినిధులు భావించగా.. సీడబ్ల్యూసీ భేటీని నిలిపేసినట్లు రాహుల్​గాంధీ ప్రకటించారు. పార్టీ చీఫ్​ఎంపిక విషయంపై ఇంకా నిర్ణయానికి రాలేదన్నారు. జమ్మూకాశ్మీర్​లో హింస చోటుచేసుకుందని, పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని తమకు రిపోర్టులు అందాయని చెప్పారు. ఈ ప్రచారం నేపథ్యంలో అసలు జమ్మూ కాశ్మీర్లో ఏంజరుగుతోందనే విషయంపై ప్రధాని మోడీ దేశానికి వివరణ ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. రాహుల్ మీడియాతో మాట్లాడిన కాసేపటికే సోనియాను పార్టీ చీఫ్​గా ఎన్నుకున్నట్లు సీడబ్ల్యూసీ ప్రకటించింది.

రాహులే కొనసాగాలి

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహులే కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని బృందానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. మన్మోహన్  నేతృత్వంలో వేసిన కమిటితో రాష్ట్ర నేతలు ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు.

Latest Updates