ఆపరేషన్ కేలా ముల్లర్ ఎలా జరిగిందంటే..

ఐసీస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన వార్తను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్ మినిట్ టు మినిట్ డిటైల్స్​తో మీడియాకి వెల్లడిం చారు.ఆయన చెప్పిన ప్రకారం… అమెరికా చాలా పకడ్బందీ ప్లాన్ తో బాగ్దాదీ స్థావరాల్ని చుట్టు ముట్టింది.

నెల్లాళ్ల క్రితమే స్కెచ్​

 • నెల్లాళ్ల క్రితం అమెరికా ఇంటెలిజెన్స్​ వర్గాలు బాగ్దాదీ రాకపోకలు, అతని స్థావరాలపై పూర్తి సమాచారం రాబట్టింది. ఐసీస్​కి వ్యతిరేక కుర్దుల నుంచి, లొంగిపోయినవాళ్ల నుంచి సేకరించింది.
 •  ఈ సమాచారం ఆధారంగా రెండు వారాల క్రితమే బాగ్దాదీ ఎక్కడున్నదీ నిక్కచ్చిగా ఇంటెలిజెన్స్​ కనిపెట్టేసింది. కమాండర్​–ఇన్​–చీఫ్​ హోదాలో ట్రంప్​ దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు.
 • ఈ ప్లాన్​లో భాగంగా అమెరికా యుద్ధ విమానాలు  రష్యా, ఇరాక్​, టర్కీ కంట్రోల్​లో ఉన్న గగనతలం మీదుగా ఎగరడానికి తగిన రంగం సిద్ధం చేసుకుంది.  ఆయా దేశాలు తమ వార్​ జెట్​లకు అడ్డు చెప్పకుండా అనుమతి తీసుకుంది. తమ ఆపరేషన్​ వివరాల్ని, సిరియాలో ఏం చేయబోతున్నామన్నది రష్యాకు వెల్లడించలేదుగానీ, ‘మీరు నచ్చే పని చేస్తున్నాం’ అని రష్యా అధికారులకు అమెరికా చెప్పింది.
 • అమెరికా తాము చేపట్టే ఆపరేషన్​కి ‘కేలా ముల్లర్​’ పేరు పెట్టింది. ఆరిజోనాకి చెందిన కేలా (26) ఐసీస్​ బాధితురాలు. అమెరికా మానవ హక్కుల కార్యకర్తగా సిరియాలోని అలెప్పోలో మెడికల్​ సర్వీసుకి వెళ్లింది.  అక్కడ ‘డాక్టర్స్​ వితవుట్​ బోర్డర్స్​’ హాస్పిటల్​ నుంచి వస్తూ ఐసీస్​ మిలిటెంట్లకు బందీగా చిక్కింది. 2015 ఫిబ్రవరిలో  సామూహికంగా అనేకసార్లు రేప్​ చేసి, దారుణంగా చంపేశారు.

శనివారం మధ్యాహ్నం ఆపరేషన్​ షురూ

 •  అంతా ఓకే అనుకున్నాక… శనివారం మధ్యాహ్నం ఈ ఆపరేషన్​ మొదలైంది. వర్జీనియాలో గోల్ఫ్​ ఆడుతున్న ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ సాయంత్రం నాలుగున్నరకల్లా వైట్​ హౌస్​కి వచ్చేశారు. అప్పటికి సిరియా టైమ్​ రాత్రి పదిన్నర. వైట్ ​హౌస్​లోని సిట్యుయేషన్​ రూమ్​లో అప్పటికే వైస్​ ప్రెసిడెంట్​ మైక్​ పెన్స్​, రక్షణ మంత్రి మార్క్​ ఎస్పెర్​, సెక్యూరిటీ అడ్వయిజర్​ రాబర్ట్​ ఓబ్రియన్​, ఇతర ఇంటెలిజెన్స్​ సీనియర్​ అధికారులు రెడీగా ఉన్నారు. అక్కడ అమర్చిన భారీ స్క్రీన్లపై ‘ఆపరేషన్​ కేలా ముల్లర్​’ని చూస్తూ గడిపారు.
 •  సిరియా నార్త్​ వెస్ట్​ ఏరియాకి పశ్చిమ ఇరాక్​లోని ఎయిర్​ బేస్​ నుంచి మొత్తం ఎనిమిది అమెరికా హెలికాప్టర్లు బయలుదేరాయి. బాగ్దాదీ దాక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. వాటి నుంచి సైనికులు, మిలిటరీ కుక్కలు కిందకు దిగాయి. వీళ్లు కౌంటర్​ టెర్రరిజంకోసం పనిచేసే అమెరికా స్పెషల్​ యూనిట్లలోని డెల్టా ఫోర్స్​కి చెందినవాళ్లు. ఆషామాషీ ఆపరేషన్లకు వీళ్లను రంగంలో దింపరు. ఏదైనా హైవాల్యూ టార్గెట్​ ఉన్నప్పుడు మాత్రమే ఈ డెల్టా ఫోర్స్​ దిగుతుంది.
 • డెల్ట్​ ఫోర్స్​కి సపోర్టుగా సిరియాలోని ఇడ్లిబ్​ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌక రెడీగా ఉంది. మిలిటరీ రోబోనుకూడా తీసుకెళ్లినా ఉపయోగించలేదు.  బాగ్దాదీ తలదాచుకున్న ఏరియాని చుట్టుముట్టాక హెలికాప్టర్లపై ఫైరింగ్​ మొదలైంది. ఐసీస్​ మిలిటెంట్లను మట్టుబెట్టి సైన్యం సేఫ్​గా కిందకు దిగిపోయింది.

ఫినిషింగ్​ టచ్​ జరిగిందిలా..

 • కాంపౌండ్​లో ఉన్న మిగతా మిలిటెంట్లు తమంతట తాముగా లొంగిపోవడమో, లేదా సైన్యం గుళ్లకు బలవడమో జరిగింది. అక్కడున్న 11 మంది పిల్లలను సురక్షితంగా అక్కడినుంచి మరొకరికి (థర్డ్​ పార్టీకి) అప్పగించేశారు. ఈ థర్డ్​ పార్టీ ఎవరన్నదీ ట్రంప్​ చెప్పడానికి ఇష్టపడలేదు.
 • అయితే, సైన్యం వెంటనే ఇంటి తలుపును బద్దలు కొట్టలేదు. బూబీ ట్రాప్​ (తెరవగానే పేలడానికి వీలుగా) అమర్చినట్లు సైన్యం భావించింది. ఇంటి గోడను పేల్చివేసి, సైన్యం లోపలికి ప్రవేశించి, ఇస్లామిక్​ స్టేట్​ ఫైటర్లను పట్టుకుంది.
 • ఇదంతా జరుగుతున్న సమయంలోనే బాగ్దాదీ తప్పించుకుని టన్నెల్​లోకి దూరిపోయాడు. తనతోపాటు ముగ్గురు పిల్లల్నికూడా సొరంగంలోకి తీసుకెళ్లిపోయాడు. వీళ్ల జాడ గుర్తించాక లొంగిపోవలసిందిగా పదే పదే సైన్యం కోరింది. ఈ లోగా కుక్కలుకూడా తరుముకొచ్చాయి.
 • బాగ్దాదీ ఏడుస్తూ, కేకలు పెట్టడం సైన్యానికి వినిపించింది. సొరంగం చివరికి వచ్చాక ఎటు పోవాలో తెలియలేదు. దాంతో తన ఒంటికి వేసుకున్న ఆత్మాహుతి కోటును పేల్చేసుకున్నాడు. బాంబు ధాటికి సొరంగం కుప్పకూలింది. అతని పిల్లలుకూడా చనిపోయారు.
 • బాంబు పేలుడులో బాగ్దాదీ శరీరం తునాతునకలైంది. సైన్యం అతని బాడీ అవశేషాలు సేకరించి, అక్కడికక్కడే డిఎన్​యే టెస్ట్​ చేసింది. 15 నిమిషాల తర్వాత బాగ్దాదీ చచ్చిపోయినట్లుగా అధికారికంగా గుర్తించింది.

రెండు గంటల్లో మొత్తం ముగిసింది

 •  ‘కేలా ముల్లర్​ ఆపరేషన్​’లో సైనికులెవరూ గాయపడలేదని, ఒక కుక్కమాత్రం బాగా గాయాలపాలైంది.
 •   సైన్యం ఆ ఇంటిని, కాంపౌండ్​ని జల్లెడ పట్టి… ఇస్లామిక్​ స్టేట్​కి సంబంధించిన సమాచారాన్ని, భవిష్యత్తు ప్లాన్లను సేకరించింది. ఈ ప్రాసెస్​ అంతా రెండు గంటలపాటు సాగింది.
 • ఆపరేషన్​ కేలా ముల్లర్​ని సక్సెస్​ఫుల్​గా ముగించుకుని వచ్చిన ఎయిర్​ రూట్​ నుంచే సైన్యం వెనక్కి మళ్లిపోయింది.
 • బాగ్దాదీ అంత్యక్రియలకు సంబంధించి ఇస్లామిక్​ లా, సంప్రదాయాలపై అమెరికా ఇస్లాం పండితులను సంప్రదించింది. 2011లో అల్​ ఖైదా లీడర్​ ఒసామా బిన్​ లాడెన్​ విషయంలో చేసిన పద్ధతిలోనే బాగ్దాదీకికూడా అంత్యక్రియలు జరిపామన్నారు.
 •  కొన్నేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసీస్​ చీఫ్​ అబూ బకర్​–అల్​ బాగ్దాదీ మృతదేహాన్ని సముద్రంలోకి జారవిడిచినట్లు నేషనల్​ సెక్యూరిటీ అడ్వయిజర్ రాబర్ట్​ ఓబ్రియన్​ ప్రకటించారు.

అంతా సినీ స్టయిల్​లోనే!

ఆపరేషన్​ కేలా ముల్లర్​ మొత్తం అమెరికన్​ వార్​ ఫిల్మ్​ ‘బ్లాక్​ హాక్​ డౌన్​ (2001)’లో జరిగినట్లే జరిగింది. 1993లో సోమాలియాలో అంతర్యుద్ధం​ మొదలవుతుంది.  సోమాలియా రాజధాని మొగాదిష్​లో దాక్కున్న ఫ్యాక్షన్​ లీడర్​ మహమ్మద్​ ఫరా అయిదీద్​ని పట్టుకోవడంకోసం అమెరికా డెల్ట్​ ఫోర్స్​ హెలికాప్టర్లలో బయలుదేరుతుంది. ఈ ఆపరేషన్ సక్సెస్​ఫుల్​ కాదు. 19మంది అమెరికా సైనికులు, వెయ్యిమంది సోమాలియన్లు చనిపోతారు. చివరకు సైన్యం వెనకడుగు వేస్తుంది. అది వేరే కథ. అయితే,   సైనిక చర్య మొత్తాన్ని సిట్యుయేషన్​ రూమ్​ద్వారా నడిపిస్తారు. అందుకే​ ‘బాగ్దాదీ వేటకోసం జరుపుతున్న అపరేషన్​కూడా మాకు సినిమాని చూసినట్లే అనిపించింది’ అన్నారు ట్రంప్​.

Latest Updates