ఆరో రోజుకి చేరిన పంజాబ్ రైతుల రైల్ రోకో

పంజాబ్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ లో రైతులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. పంజాబ్ రైతుల రైల్ రోకో మంగళవారానికి ఆరో రోజుకు చేరింది. అమృత్ సర్ జిల్లాలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యులు రైలు పట్టాలపై బైఠాయించారు. అక్టోబర్ 1న జాతీయ స్థాయి ఉద్యమంపై కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రకటన చేయనుంది. రైతు చట్టాలను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దేశవ్యాప్త ఆందోళన చేస్తామన్నారు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతలు.

పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమన్నారు. న్యాయ, వ్యవసాయ నిఫుణులతో సంప్రదించి రాష్ట్ర వ్యవసాయ చట్టాలను ఈ మేరకు సవరిస్తామని  తెలిపారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.

Latest Updates