గూడ్స్ రైలు ఢీకొని రైల్వే కూలీ మృతి..మరో కూలీకి తీవ్ర గాయాలు

గూడ్స్ రైలు ఢీకొని రైల్వే కూలీ మృతి..మరో కూలీకి తీవ్ర గాయాలు
  • రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు, స్థానికుల ఆందోళన

కాగజ్ నగర్, వెలుగు: రైల్వే ట్రాక్​పై పనిచేస్తున్న కూలీలపైకి గూడ్స్​రైలు రివర్స్​లో దూసుకొచ్చింది. ఇద్దరిని ఢీకొట్టగా.. ఒకరు స్పాట్​లోనే చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన జంషీద్ హుస్సేన్(44) కూలీ పనిచేస్తుంటాడు. మంగళవారం కాంట్రాక్టర్ పిలవడంతో ట్రాక్ కూలీ పనికి వెళ్లాడు. 

తోటి కూలీలు ప్రవీణ్, సర్వేశ్​తో కలిసి సిర్పూర్–కాగజ్ నగర్ మధ్య ట్రాక్​పై అర్ధరాత్రి పనిచేస్తుండగా గూడ్స్ రైలు సిర్పూర్ నుంచి కాగజ్ నగర్ వైపునకువెళ్లింది. అక్కడ హైట్​ఎక్కువగా ఉండడంతో ముందుకు వెళ్లలేక వెనక్కి వచ్చింది. పనిచేస్తున్న జంషీద్ హుస్సేన్​పై ఎక్కింది. దీంతో అతడు పట్టాల మీద రెండు ముక్కలుగా తెగిపడింది. మరో కూలీ ప్రవీణ్ కు చెయ్యి విరిగింది. 

అతడిని హైదరాబాద్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు రివర్స్​వస్తున్న విషయాన్ని రైల్వే అధికారులు పనిచేస్తున్న కూలీలకు సమాచారం ఇవ్వలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే జంషీద్ హుస్సేన్ ప్రమాదంలో చనిపోయాడని బంధువులు, స్థానికులు మండిపడ్డారు. పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెయిన్ రోడ్డు మీద ఆందోళనకు దిగారు. చివరకు కాంట్రాక్టర్ పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు.