రైల్వే ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన మంత్రి

స్టాక్ హోమ్: త్వరలో రైళ్లలోనూ వైఫై సర్వీస్ అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న సేవలను రైళ్లలోనూ స్టార్ట్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. స్వీడన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. భారత ప్రభుత్వమే దీన్ని నడుపుతుందని, దేశ ప్రజలకు రైల్వే సేవలందిస్తుందని చెప్పారు.

వైఫైతో భద్రత పెరుగుతుంది

రైలు ప్రయాణం సాగుతున్నంత సేపూ లోపలి ప్రయాణికులకు వైఫై సేవలను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో ఇది పూర్తి చేస్తామన్నారు. ఇందుకు రైళ్లలో వైఫై ఎక్యూప్ మెంట్ పెట్టడంతో పాటు టవర్లను అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం అవసరమయ్యే టెక్నాలజీపై విదేశాలను ఆహ్వానిస్తామన్నారు. స్వీడన్ తో టెక్నాలజీ సహకారంపై చర్చిస్తామన్నారు.

రైళ్లలో వైఫై రావడంతో ప్రయాణికుల భద్రత మరింత పటిష్టమవుతుందని గోయల్ అన్నారు. రైలు కోచ్ లలో సీసీటీవీ కెమెరాలు పెడతామని, వైఫై ద్వారా లైవ్ ఫీడ్ పోలీసు కంట్రోల్ రూమ్ లకు చేరేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని ద్వారా రైళ్లలో నేరాలను పూర్తిగా నియంత్రించవచ్చన్నారు.