రోజుకు 2.6 లక్షల ఆహార పొట్లాలు.. పంపిణీకి రైల్వే శాఖ రెడీ

గౌహతి: దేశంలో లాక్​డౌన్ అమలు నేపథ్యంలో తిండి దొరకని పేదలకు, కూలీలకు భోజనం పంపిణీ చేసేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌‌సీటీసీ) కిచెన్స్ నుంచి రోజుకు 2.6 లక్షల ఆహార పొట్లాలను రాష్ట్రాలకు సప్లై చేయనున్నట్లు ప్రకటించింది. అవసరాన్ని బట్టి మరింత మందికి భోజనం పంపిణీ చేస్తామని తెలిపింది. అవసరమైన జిల్లాల అధికారులు ఆహార ప్యాకెట్లను తీసుకోవచ్చని, ఒక్కో భోజనం ప్యాకెట్​కు రూ.15 చెల్లించవచ్చని పేర్కొంది. తమ వద్ద కొనుగోలు చేసిన ఫుడ్ ప్యాకెట్లకు ప్రభుత్వాలు వెంటనే డబ్బు చెల్లించనవసరం లేదని స్పష్టం చేసింది.

ఐఆర్​సీటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైల్వే వంటశాలల్లో భోజనం తయారు చేస్తున్నామని, పొట్లాలలో ప్యాక్ చేసి ఆర్పీఎఫ్​, స్వచ్చంద సంస్థల సహకారంతో రైల్వే స్టేషన్లకు దగ్గరలోని పేదలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫుడ్‌ తయారు చేసేందుకు వస్తున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, కిచెన్‌లోకి ఎంటరయ్యే ముందు సిబ్బందికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేస్తున్నామని రైల్వే అధికారులు చెప్పారు. శానిటైజ్ చేసుకుని మాస్కులు, గ్లౌజులు వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.

Latest Updates