తిట్టారు.. కొట్టారు.. తన్నారు.. నోట్లో… పోశారు!

railway-police-attack-on-video-journalist-in-uttar-pradesh

ఉత్తరప్రదేశ్​లో టీవీ జర్నలిస్టుపై రైల్వే పోలీసుల దారుణం

ముఖ్యమంత్రిపై అభ్యంతరకర కామెంట్స్ చేశారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్​లో జర్నలిస్టులను  అరెస్టు చేసిన వివాదం చల్లారకముందే, మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘న్యూస్ 24’ అనే చానల్ తరఫున శామ్లీ జిల్లాలో స్ట్రింగర్​గా పని చేస్తున్న అమిత్ శర్మ అనే జర్నలిస్టుపై రైల్వే పోలీసులు దాడి చేశారు. తిట్టారు. కొట్టారు. తన్నారు. పిడిగుద్దులు గుప్పించారు. తన నోట్లో మూత్రం పోశారని బాధిత జర్నలిస్టు చెప్పాడు. అయితే అమిత్ ఆరోపణలను ప్రభుత్వ రైల్వే పోలీసులు ఖండించారు.

అసలేం జరిగిందంటే..
మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పిందన్న సమాచారం రావడంతో దాన్ని కవర్ చేసేందుకు అమిత్ శర్మ వెళ్లాడు. వీడియో రికార్డు చేస్తుండగా, ఇంతలో కొందరు పోలీసులు సివిల్ డ్రస్సులో వచ్చారు. కెమెరా లాక్కుని నేలకేసి కొట్టారు. ఫోన్ తీసుకున్నారు. తర్వాత అతడిపై దాడి చేసి, పోలీస్ స్టేషన్​కు లాక్కెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక జర్నలిస్టులు వెంటనే పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఆందోళన చేశారు. అమిత్​శర్మపై పోలీసులు దాడి చేస్తున్న వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్​చేశారు. జిల్లా హెడ్​క్వార్టర్స్ లోని సీనియర్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం అమిత్​ను విడుదల చేశారు.

అందుకే దాడి చేశారు..
పోలీస్​స్టేషన్​ లాకప్​లో ఉన్న అమిత్.. తన తోటి జర్నలిస్టులతో మాట్లాడటం వీడియోలో కనిపించింది. ‘‘10–15 రోజుల కిందట నేను వాళ్ల మీద స్టోరీ రాశాను. ఆ స్టోరీకి సంబంధించిన మొత్తం ఫుటేజీ పోలీసులు లాక్కున్న ఫోన్​లోనే ఉంది” అని స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యాక అమిత్ చెప్పాడు. రైళ్లలో హాకర్స్‌‌‌‌పై స్టోరీ రాసినందుకే తనపై దాడి చేశారని తెలిపాడు. అందుకు సంబంధించిన ఫుటేజీ మొత్తం ఫోన్​లో ఉందన్నాడు.

ఇద్దరిపై సస్పెన్షన్ వేటు
ఘటనకు సంబంధించి శామ్లీ రైల్వే పోలీస్ స్టేషన్ హౌస్​ఆఫీసర్, కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు. ‘‘జర్నలిస్టును కొడుతున్న, లాకప్​లో పెట్టిన వీడియోను మేం చూశాం. ఎస్​హెచ్​వో రాకేశ్ కుమార్, కానిస్టేబుల్ సంజయ్ పవార్​ను వెంటనే సస్పెండ్ చేయమని డీజీపీ ఓపీ సింగ్ ఆర్డర్లిచ్చారు. ప్రజలతో దురుసుగా ప్రవర్తించే పోలీసులను కఠినంగా శిక్షిస్తాం” యూపీ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది.
– అమిత్ శర్మ

Latest Updates