పాక్ లోని రైల్వేస్టేషన్ కు గురునానక్ పేరు పెడతాం…

పాకిస్తాన్ లోని నంకనా సాహిబ్ రైల్వే స్టేషన్‌కు సిక్కు మతం వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ పేరు  పెట్టబోతున్నట్లు అక్కడి రైల్వే మంత్రి షేక్ రషీద్ తెలిపారు. ఆదివారం రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన మంత్రి..ఇది పాకిస్తాన్‌లోని ఉత్తమ రైల్వే స్టేషన్లలో ఒకటన్నారు. దేశంలో మత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని నంకనా సాహిబ్ ఒక నగరం. అటువంటి నగరంలో జన్మించి బోధించడం ప్రారంభించిన సిక్కుల మొదటి గురువు గురునానక్ పేరు పెట్టడం గొప్పవిషయమన్నారు. లాహోర్ నుండి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం చారిత్రాత్మక,మతపరమైన విలువ కలిగిన నగరమన్నారు. ఈ నగరం ప్రపంచం నలుమూలల నుండి సిక్కులకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమన్నారు. బాబా గురు నానక్ రైలు అనే కొత్త రైలును లాహోర్ నుండి నంకనాకు త్వరలో ప్రారంభించనున్నట్లు రషీద్ తెలిపారు. అక్టోబర్ 30 వరకు రైల్వే స్టేషన్ పనులు పూర్తవతాయన్నారు. రైల్వే స్టేషన్‌ను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు.

Latest Updates