ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్న రైల్వే మంత్రిత్వ శాఖ‌

మరి కొద్దిరోజుల్లో లాక్‌డౌన్ ముగియబోతోందని, 15వ తేదీ నుంచి రైలు ప్రయాణాలకు సంబంధించి రైల్వేశాఖ రిజర్వేషన్లను ప్రారంభించిందని వ‌స్తున్న వార్త‌ల‌పై రైల్వే మంత్రిత్వ‌ శాఖ క్లారిటీ ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రారంభ తేదీలు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న‌ వార్తలు పూర్తిగా అవాస్త‌వం అని తెలిపింది. లాక్ డౌన్ న‌డుస్తున్న వేళ ఇలాంటి వార్త‌లు ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తాయ‌ని తెలిపింది. రైలు ప్రయాణాలపై ప్ర‌భుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తక్షణమే రైల్వేశాఖ తెలియజేస్తుంద‌ని పేర్కొంది.

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశ‌మంతటా లాక్ డౌన్ ఉండ‌గా ప్రయాణికులకు మార్గదర్శకాలు, రిజర్వేషన్ల ప్రారంభ తేదీలు అంటూ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్… ఏదైనా ప్రసారం చేసేప్పుడు సంబంధిత వర్గాల నుంచి అధికారికంగా తెలుసుకొని ప్రసారం చేయాలని చెప్పింది. లాక్‌డౌన్ పొడిగింపుపై శనివారం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధాని న‌రేంద్ర మోడీ .. రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించబోతున్నారు. లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవడానికే ప్రత్యేకంగా ఆయన ఈ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Latest Updates