తరగతుల వారీగా రైల్వే యూజర్ ఛార్జీల వసూలు

విమానాశ్రయాల్లో మాదిరిగా రైల్వే ప్రయాణికులు కూడా యూజర్‌ ఛార్జీలు చెల్లించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. టికెట్‌పై అదనంగా రూ.10 నుంచి రూ.35 వరకు భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ ఇప్పటికే పూర్తి చేయగా.. త్వరలో కేబినెట్‌ ఆమోదానికి పంపనుంది. ఎంపిక చేసిన స్టేషన్లలో టికెట్‌ ధరకు అదనంగా యూజర్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

తరగతుల వారీగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేసేందుకు రైల్వే శాఖ రెడీ అవుతోంది. దిగువ తరగతి ప్రయాణికుడికి ఒకలా.. ఏసీ తరగతికి మరోలా ఈ యూజర్‌ ఛార్జీలు ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రూ.10 నుంచి రూ.35 మధ్య ఈ ధర ఉండనుంది. ప్రస్తుతం దేశంలో 7వేల స్టేషన్లు ఉండగా.. సుమారు 700 నుంచి వెయ్యి స్టేషన్లలో ఈ ఛార్జీల పద్ధతిని ప్రవేశపెట్టనున్నారని సమాచారం. అధిక రద్దీ కలిగి, ఆయా స్టేషన్ల అభివృద్ధి పూర్తయిన తర్వాతే ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

Latest Updates