రైళ్లలో కొత్తగా 4 లక్షల బెర్త్ లు

రైలు ప్రయాణికులకు గుడ్​న్యూస్. వచ్చే అక్టోబర్​ నుంచి ప్రతి రోజు అదనంగా 4 లక్షలకుపైగా బెర్త్​లు అందుబాటులోకి రానున్నాయి. రైళ్లలో లైటింగ్, ఎయిర్​ కండిషనింగ్​ కోసం పవర్​ కార్లను వాడకుండా కొత్త టెక్నాలజీతో ఇంజన్​ నుంచే పవర్​జనరేట్​ చేస్తారు. పవర్​ కార్ల ప్లేస్​లో అదనపు బోగీలు పెట్టడం ద్వారా బెర్త్​ల సంఖ్య పెరగనుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.

పవర్​ కార్స్​ ప్లేస్​లో బోగీలు

ప్రస్తుతం ప్రతి రైలుకు చివరలో ఒకటో రెండో పవర్​ కార్స్​ ఉంటాయి. వీటి నుంచి కోచ్​లకు ఎలక్ట్రిసిటీ అందుతుంది. ఈ పవర్​ కార్స్​ డీజిల్​ ఇంజన్​ ద్వారా నడుస్తాయి. వీటిని ఎండ్​ ఆన్​ జనరేషన్(ఈవోజీ)​ అని పిలుస్తారు. నాన్​ ఏసీ కోచ్​లకు పవర్​ అందించేందుకు పవర్​ కార్లకు గంటకు 40 లీటర్ల డీజిల్​ కావాలి. ఏసీ కోచ్​అయితే గంటకు 65- నుంచి 70 లీటర్ల డీజిల్​ అవసరం. ఒక లీటర్ డీజిల్​ తో మూడు యూనిట్ల విద్యుత్​ ఉత్పత్తి అవుతుంది. నాన్​ ఏసీ కోచ్​లకు గంటకు సుమారు 120 యూనిట్ల పవర్​ అవసరమవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెడ్​ ఆన్​ జనరేషన్(హెచ్​వోజీ) అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఈ పద్ధతిలో ఓవర్​హెడ్​ పవర్​ లైన్స్​ ద్వారా ట్రైన్​ కోచ్​లకు పవర్​ సప్లై అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్​ నాటికి 5 వేల కోచ్​లు కొత్త టెక్నాలజీతో పనిచేయనున్నాయి. పవర్​ కార్లకు గుడ్​బై చెప్పి.. అదనపు కోచ్​లను అందుబాటులోకి తీసుకురావడమే కాక.. ఈ కొత్త టెక్నాలజీ వల్ల రైల్వేలకు ఏటా పెట్రోల్‌ బిల్లులపై రూ.6 వేల కోట్లకుపైగా ఆదా కానుంది.

పొల్యూషన్​ ఫ్రీ..

కొత్త టెక్నాలజీ పర్యావరణానికి హాని కలిగించనిదని, ఎయిర్, నాయిస్​ పొల్యూషన్​ ఉండదని, కార్బన్​ ఎమిషన్స్​ కూడా ఒక ట్రైన్​కు ఏడాదికి 700 మెట్రిక్​ టన్నులకు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ‘‘ఉదాహరణకు ప్రతి శతాబ్ది ఎక్స్​ప్రెస్​చివర డీజిల్​తో నడిచే రెండు పవర్​ కార్స్​ ఉంటాయి. కొత్త సిస్టమ్​కు మారితే ఒక పవర్​ కార్​ సరిపోతుంది. అది కూడా స్టాండ్​ బై కోసం. ట్రైన్ లెంగ్త్​ పెరగకుండా మరో పవర్​ కార్​ ప్లేస్​లో పాసింజర్​ కోచ్​ అందుబాటులోకి వస్తుంది. ఇలా మొత్తం పవర్​ కార్లను రీప్లేస్​ చేసినట్లయితే ప్రతి రోజు 4 లక్షల బెర్త్​లు పైగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది” అని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు.

 

 

 

Latest Updates