సుమారు 60 లక్షల హెక్టార్లలో మంటలు… వానకు ఆగునా

  • కంగారుల దేశానికి కాస్త రిలీఫ్‌‌‌‌ ఇచ్చిన వర్షం
  • ఎల్లుండికి మళ్లీ మంటలెక్కువైతయ్‌‌‌‌: నిపుణులు
  • సహాయక చర్యలకు మరోరూ. 10 వేల కోట్లు విడుదల

ఆస్ట్రేలియాలో బుష్‌ఫైర్స్‌ రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. గత సెప్టెంబర్‌‌‌‌లో మొదలైన ఈ మంటల వల్ల ఇప్పటికే 24 మంది మృతి చెందారు. కోట్లాది అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. న్యూసౌత్‌‌‌‌వేల్స్‌‌‌‌, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సుమారు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. ఇలాంటి టైంలో సోమవారం సిడ్నీ నుంచి మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ తీరం వెంబడి కురిసిన వర్షం అక్కడి జనానికి కాస్త రిలీఫ్‌‌‌‌ ఇచ్చింది. టెంపరేచర్లు కాస్త తగ్గాయి. కానీ గురువారం నాటికి మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందని, వేడి ఎక్కువై మంటలు విజృంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటున్నారు.

సోమవారం పడిన వర్షానికి 20 రెట్లు ఎక్కువ కురిస్తేనే (200 మిల్లీమీటర్లు) విక్టోరియాలోని మంటలు అదుపులోకి వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం మరో రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌‌‌‌ మోరిసన్‌‌‌‌ సోమవారం ప్రకటించారు. అవసరమైతే మరింత అందించేందుకూ రెడీ అన్నారు. కార్చిచ్చు ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. బుష్‌ఫైర్స్‌ వల్ల ఇండియా పర్యటన (జనవరి 13 నుంచి 4 రోజులు)ను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం న్యూ సౌత్‌‌‌‌వేల్స్‌‌‌‌లో 135 చోట్ల మంటలు మండుతూనే ఉన్నాయి. 70 ప్రాంతాల్లో మంటలింకా అదుపులోకి రాలేదు. మంటల వల్ల న్యూసౌత్‌‌‌‌ వేల్స్‌‌‌‌లో సోమవారం మరో ఇద్దరు కనబడకుండా పోయారు.

జంతువుల కోసం ఇర్విన్‌‌‌‌ ఫ్యామిలీ

జంతువులను కాపాడే పనిని ఫేమస్‌‌‌‌ క్రొకొడైల్‌‌‌‌ హంటర్‌‌‌‌ స్టీవ్‌‌‌‌ ఇర్విన్‌‌‌‌ ఫ్యామిలీ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు సుమారు 90 వేల జంతువులను కాపాడి చికిత్స చేయించగా వీటిలో ఎక్కువగా ఆస్ట్రేలియా మంటల్లో చిక్కుకున్నవే ఉన్నాయి. ఇవన్నీ ఆస్ట్రేలియా జూ వైల్డ్‌‌‌‌లైఫ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పొందుతున్నాయని రాబర్ట్‌‌‌‌ ఇర్విన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ ద్వారా చెప్పారు. మరోవైపు అమెరికాకు చెందిన 20 ఏళ్ల మోడల్‌‌‌‌ కేలెన్‌‌‌‌ వార్డ్‌‌‌‌ ఆస్ట్రేలియా బుష్‌‌‌‌ ఫైర్‌‌‌‌ బాధితులకు సాయం చేయడానికి రూ. 70 లక్షలకు పైగా సేకరించారు. తన ట్విట్టర్ అకౌంట్ ‘ది నేకెడ్ ఫిలాంత్రఫిస్ట్’ ద్వారా జనవరి 4న వార్డ్ ట్వీట్ చేస్తూ..  ‘ఎవరైనా10 డాలర్లు, అంతకన్నా ఎక్కువ తన అకౌంట్‌‌‌‌కు పంపితే న్యూడ్ ఫోటోలు పంపుతా’ అని వెల్లడించారు. ఇలా రెండ్రోజుల్లో రూ. 70 లక్షలకు పైగా ఆమె డబ్బు కూడగట్టగలిగారు.

Latest Updates