ఉత్తరాది రాష్ట్రాల్లో గాలివానలు బీభత్సం

ఉత్తరాదిలో వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. గాలి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో వర్షాలు, బలమైన గాలుల ప్రభావం…, పలు రాష్ట్రాల్లో భారీ నష్టాలను మిగిల్చాయి. మధ్యప్రదేశ్ లోని గత రెండు రోజుల్లో వర్ష బీభత్సం, పిడుగులకు 16 మంది బలయ్యారు. రాజస్థాన్ లో ఆరుగురు అకాల వర్షాల ధాటికి చనిపోయారు. అటు గుజరాత్ లోనూ నిన్న ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు జనాన్ని వణికించాయి. దీంతో గుజరాత్ లోనూ 11 మంది చనిపోయారు. చెట్లు, ఇళ్లు కూలిపోవడం, కరెంట్ షాక్ లు, పిడుగుపాట్లతో జనం బలయ్యారు. ఈ అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో పగటి ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల మేర తగ్గాయి. ఎండల నుంచి ఉపశమనం కలిగినా.. అకాల వర్షాలు పెను నష్టాన్ని మిగిల్చాయి. అటు మహారాష్ట్రలోనూ ఈనెలలో అకాల వానలు, పిడుగులకు 12 మంది చనిపోయినట్లు విపత్తు నిర్వహణ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

గుజరాత్ లో అకాల వర్షాల ధాటికి చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. గాయపడ్డ వారికి 50 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ కు IMD అలర్ట్ జారీ చేసింది. గాలుల వేగం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ వారాంతం వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో అక్కడక్కడ ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అలర్ట్ చేసింది వాతావరణశాఖ. అకాల వర్షాలకు మధ్యప్రదేశ్, గుజరాత్ లో పంటలకు నష్టం జరిగింది. అటు ఇంఫాల్ లోనూ ఇవాళ గాలివాన బీభత్సం సృష్టించింది.

గుజరాత్ లో గాలి వాన బీభత్సానికి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించడాన్ని తప్పుబట్టారు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్. మధ్యప్రదేశ్ లోనూ భారీ నష్టాలు కలిగాయన్నారు. మోడీ కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధాని కాదని, దేశానికంతా ప్రధానమంత్రి అని గుర్తు చేశారు. మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. సహాయక చర్యలపై ఫోకస్ పెట్టారు. రాజస్థాన్ లో పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారు.

Latest Updates