భవనంపై నుంచి నోట్ల కట్టల వర్షం.. వీడియో వైరల్

చదవగానే మన దగ్గర కూడా ఇటువంటి ఘటన జరిగితే బాగుండు అనిపిస్తుంది కదా.. అంతే మరి డబ్బంటే ఎవరికి చేదు. అవును భవనం పైనుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది. కానీ, అది ఇక్కడ కాదు.. కలకత్తాలో జరిగిందీ ఘటన. కలకత్తాలోని ఓ వాణిజ్య భవనం కిటికీ నుంచి నోట్ల వర్షం కురిసింది. డైరెక్టరెట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం మధ్యాహ్నం కలకత్తాలోని బిజినెస్ జిల్లా బెంటిక్ స్ట్రీట్‌లో ఉన్న హోక్ మర్చంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై దాడులు నిర్వహించారు. హోక్ మర్చంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ నిర్వహిస్తుంది. అధికారుల రాకను గమనించిన కంపెనీ సిబ్బంది కార్యలయంలో ఉన్న రద్దైన నోట్లు 1000, 500, మరియు 100 రూపాయల కట్టలను కిటికీ నుంచి కిందికి విసిరేసింది. ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న ఓ షాపు యజమాని భవనం పైనుంచి నోట్ల కట్టలు పడటాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన డీఆర్ఐ అధికారులు మాత్రం సోదాలకు, నోట్ల కట్టలు పడేయటానికి సంబంధం లేదని అంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై దీనిపై విచారణ జరుపుతున్నారు. నోట్ల రద్దు జరిగి మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా రద్దు నోట్లు బయటపడుతుండటం గమనార్హం.

Latest Updates