వర్షపాతం డేటానా.. రూ.20 లక్షలైతది

  • ఆర్టీఐ ద్వారా తన జిల్లాలో వాన వివరాలు కోరిన నిజామాబాద్‌‌‌‌ వాసి
  • డేటాకు డబ్బులు కట్టాలన్న టీఎస్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ అధికారులు
  • రూ.3.09 లక్షల జీఎస్టీ కూడా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తమ జిల్లా వర్షపాతం వివరాలు కావాలని అడిగిన ఓ వ్యక్తికి తెలంగాణ స్టేట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ సొసైటీ అధికారులు షాకయ్యే సమాధానమిచ్చారు. డేటా కావాలంటే రూ.17.22 లక్షలు చెల్లించాలన్నారు. దానికి మరో రూ.3 లక్షల జీఎస్టీ కలిపి రూ.20 లక్షలు కట్టాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ లెటర్‌‌‌‌ చూసి అవాక్కయ్యాడు.

ఒక్కో ఏడబ్ల్యూఎస్‌‌‌‌ డేటాకు రూ.3,500

నిజామాబాద్‌‌‌‌ జిల్లాకు చెందిన రాజేశ్‌‌‌‌.. రైతు సమస్యల పరిష్కారానికి పని చేస్తుంటారు. రైతులు వాతావరణ ఆధారిత పంట బీమా పొందేందుకు వర్షపాతం వివరాలు సేకరించాలనుకున్నారు. తన జిల్లాలో 2018 జూన్‌‌‌‌ 1 నుంచి 2019 మే 31 వరకు కురిసిన వాన రికార్డుల వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద తెలంగాణ స్టేట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ సొసైటీకి ఈమధ్య దరఖాస్తు చేశారు. ఆర్టీఏ కింద ప్రభుత్వాఫీసుల్లో ఇచ్చే సమాచారానికి పేజీకి  రూ.2 చొప్పున వసూలు చేస్తుంటారు. అయితే పేజీలతో సంబంధం లేకుండా ఒక్కో ఆటోమేటిక్‌‌‌‌ వెదర్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ (ఏడబ్ల్యూఎస్‌‌‌‌)కు రూ.3,500 చొప్పున జిల్లాలోని 41 ఏడబ్ల్యూ స్టేషన్లలో 12 నెలల డేటాకు రూ.17,22,000 కట్టాలని రాజేశ్‌‌‌‌కు అధికారులు రిప్లై ఇచ్చారు. దాంతోపాటు రూ.3,09,960 జీఎస్టీ కలిపి రూ.20,31,960ను సీఈవో, టీఎస్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ పేరిట డీడీ, చెక్‌‌‌‌ రూపంలో చెల్లిస్తే సమాచారమిస్తామని చెప్పారు. ఆర్టీఐ డేటాకయ్యే ఖర్చుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్నా టీఎస్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ అధికారులు దానికీ జీఎస్టీ విధించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక్క ఆదిలాబాద్‌‌‌‌లోనే అందుబాటులో..

రైతులు క్రాప్‌‌‌‌ లోన్‌‌‌‌ తీసుకునేటప్పుడే పంట బీమా చేస్తుంటారు. వర్షాల్లేక పంట నష్టపోయితే వాతావరణ ఆధారిత పంట బీమా క్లెయిమ్‌‌‌‌ చేసుకోవచ్చు. దాని కోసం వాళ్లకు వరుసగా 15 రోజుల వర్షపాతం వివరాలు కావాలి. ఆ సమాచారం తెలిస్తేనే పరిహారం కోసం ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీని చట్టబద్ధంగా అడుగుతారు. రాష్ట్రంలో కేవలం ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలోనే కలెక్టర్‌‌‌‌ చొరవతో వర్షపాతం వివరాలను జిల్లా ప్లానింగ్‌‌‌‌ అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. డబ్బులకే డేటా ఇస్తామంటూ రైతులకు అందుబాటులో లేకుండా చేయడం సరికాదు. ‌‌‌‌‌‌‌‌- సేరుపల్లి రాజేశ్‌‌‌‌, ఆర్టీఐ కార్యకర్త

Latest Updates