బీజేపీ చేతుల్లో దేశం ముక్కలు: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ‘విభజన రాజకీయాలతో బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తోంది. మీరు నిజంగా దేశాన్ని ప్రేమిస్తే ఈ అన్యాయంపై గొంతెత్తండి. ఇప్పుడు మనం మౌనంగా ఉంటే వాళ్లు రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. దేశాన్ని విభజిస్తారు.. అదే జరిగితే, ఓ అవినీతిపరుడైన బీజేపీ, ఆర్ఎస్ఎస్​ లీడర్​తో పాటు దానికి మనంకూడా బాధ్యులమే అవుతాం’ అని కాంగ్రెస్​ జనరల్​సెక్రటరీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలోని రామ్​లీలా మైదానంలో జరిగిన ‘భారత్​ బచావో సభ’లో ప్రియాంక గాంధీ బీజేపీపై మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితులపై పోరాడని వాళ్లు చరిత్రలో పిరికివాళ్లుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

మోడీ ఉంటే..

ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రియాంక ఎగతాళి చేశారు. ‘‘బస్టాపులు మొదలుకొని టీవీ చానెళ్ల దాకా ఎక్కడ చూసినా ‘మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే (మోడీ హై తో ముమ్కిన్​హై)’ అంటూ ఊదరగొడుతున్నారు.. అవును ఒకరకంగా అది నిజమే. మోడీ ఉంటే.. ఉల్లి కిలో రూ.100 కు అమ్మొచ్చు, మోడీ ఉంటే.. నిరుద్యోగం 45 ఏళ్లలో హైయ్యెస్ట్ కు​చేరుతుంది. మోడీ ఉంటే.. 4 కోట్ల ఉద్యోగాలు గల్లంతవుతయ్. మోడీ ఉంటే.. 15 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేస్కుంటరు’’ అన్నారు. ఉన్నావ్​ రేప్​ బాధితురాలి విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘బాధితురాలి ఇంటికి వెళ్లినపుడు.. వాళ్ల నాన్న చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చారు. ఆ టైంలో నా తండ్రి గుర్తొచ్చారు. 19 ఏళ్ల వయసులో నా తండ్రి డెడ్​బాడీని చూడాల్సి వచ్చింది. అప్పుడు మా నాన్న రక్తం ఈ మట్టిలో కలిసింది.. ఇప్పుడు ఉన్నావ్​ బాధితురాలి తండ్రి రక్తం భూమిని తడుపుతోంది. ఈ దేశం మనది.. దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత’ అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. బాధితురాలి ఇంటి నుంచి తిరిగొస్తుండగా ఓ చిన్న పాప తనకు ఎదురొచ్చిందని ప్రియాంక చెప్పారు. దగ్గరికి తీసుకొని, భవిష్యత్తులో ఏంకావాలనుకుంటున్నావ్​ పాపా అని అడిగితే.. జడ్జిని అవుతానని జవాబిచ్చిందన్నారు. న్యాయం కావాలి, న్యాయం జరగాలని కోరుకోవడం మాత్రమే కాదు.. దానికోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని ప్రియాంక పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఉన్నావ్​బాధితురాలిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె సూచించారు. ఒళ్లంతా మంటలతో దాదాపు కిలోమీటర్​ దాకా పరిగెత్తి మరీ పోలీసులకు ఫోన్​ చేసిందని, న్యాయం కోసం కడదాకా పోరాడిందని బాధితురాలిని ప్రియాంక మెచ్చుకున్నారు.

Latest Updates