అక్కడ బాలాజీ అంటే హనుమంతుడు

rajasthan-mehandipur-balaji-mandir

వెంకన్న స్వామికి ఉన్న చాలా పేర్లలో బాలాజీ ఒకటి. కానీ, నార్త్‌‌ ఇండియాలోని కొన్ని ఏరియాల్లో బాలాజీ అంటే హనుమంతుడు. బాల హనుమాన్‌‌ రూపంతో అంజన్నను పూజిస్తారు. కాబట్టే ‘బాలాజీ’ అనే పేరు వచ్చింది. అలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ, రాజస్తాన్‌‌లోని మెహందీపూర్‌‌ బాలాజీ మందిర్‌‌ మాత్రం సమ్‌‌థింగ్‌‌ స్పెషల్. భూతవైద్యానికి ఫేమస్ అయిన ఈ టెంపుల్‌‌కి దేశం నలుమూలల నుంచి రోజూ వేలల్లో జనాలు తరలి వస్తుంటారు.

‘దేవుడ్ని నమ్మినప్పుడు..  దెయ్యాలున్నాయన్నది కూడా నమ్మాలి’.. ఈ కొటేషన్‌‌ మెహందీపూర్‌‌ బాలాజీ టెంపుల్‌‌ గోడలపై అక్కడక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది.  ఆలయం బయటే కాదు.. లోపలి ప్రాంగణంలో కూడా జనాలతో ఎప్పుడూ రద్దీ ఉంటుంది. భక్తుల హనుమాన్‌‌ చాలీసా పఠనం, బ్యాండ్‌‌ మేళాలతో ఆ గుడి ప్రాంగణం  మారుమోగుతుంటుంది. ‘దెయ్యాల్ని తరిమే గుడి’ అనే పేరుండటంతో ఫారిన్‌‌ టూరిస్టులు కూడా  ఆసక్తిగా ఆ గుడి గురించి తెలుసుకునేందుకు వస్తుంటారు. దీంతో టూరిజం పరంగా కూడా ఆ ప్రాంతం బాగానే డెవలప్‌‌ అయ్యింది.

వణుకు పుడ్తది!
సాధారణంగా గుడి అంటే ప్రశాంత వాతావరణాన్ని ఊహించుకుంటాం. కానీ.. ఈ ఆలయంలో అలాంటివి ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే ఇక్కడ దెయ్యాల్ని వదిలించేందుకు స్పెషల్‌‌ పూజలు జరుగుతుంటాయి.  బాధితుల్ని ఓ స్పెషల్ చాంబర్‌‌లో గొలుసులతో కట్టేసి ఉంచుతారు.  అరుపులు, బ్యాండ్‌‌ల సౌండ్లతో ఆ ఆలయంలో ఎప్పుడూ గోల గోలగా ఉంటుంది. పూజ సమయంలో అయ్యగారు మంత్రాలు చదవడం ప్రారంభించాక అసలు వ్యవహారం మొదలవుతుంది. హనుమాన్‌‌ చాలీసా చదువుతూ బ్యాండ్ బాజాలు వాయిస్తుంటారు కొందరు.

‘సియా కే రామ్‌‌’ జపంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుంది. ఆ సౌండ్లకు అక్కడున్న అందరూ పరవశంతో డ్యాన్స్‌‌లు చేస్తూ ఊగిపోతారు. చివరికి ఎవరైతే స్పృహ తప్పి పడిపోతారో.. వాళ్లు ‘దెయ్యం బాధితులు’అని గుర్తించాలి.  అర్జి, సావామణి, దర్కస్త్‌‌.. పద్ధతులు ఒకదాని వెంట జరిపి దెయ్యాన్ని వదిలిస్తారు ఇక్కడ.

అంతేకాదు ఈ గుడి ఆవరణలో ఉండే నోట్‌‌ ఇంకా స్పెషల్.  ‘ఎవరేం ఇచ్చినా తినకూడదు.. తాగకూడదు. అసలు కొత్తవాళ్లతో మాట్లాడకూడదు. గుడి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూసినా నష్టమే. వీటిల్లో ఏ ఒక్కటి చేసినా దుష్టశక్తుల్ని మీ వెంట ఆహ్వానించినట్లే’ అని పెద్ద బోర్డుపై రాసి ఉంటుంది. అందుకే ఈ ఆలయ వాతావరణంలో ఎక్కువసేపు ఎవరూ ఉండలేరు.

దేవుడికి సమర్పణ ఉండదు
గుళ్లు, మందిరాల్లో ప్రసాదాలు, దేవుళ్లకు సమర్పణలు ఉంటాయి. కానీ, వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న మెహందీపూర్‌‌ బాలాజీ టెంపుల్‌‌లో అవేం కనిపించవు.  గుడి బయట కొందరు నల్లరంగు ఉండల్ని చేతిలో పెట్టి డబ్బులు అడుగుతారు. వాటిని వద్దని పడేస్తే అరిష్టం జరుగుతుందనేది జనాల భయం.  అందుకే బలవంతంగా వాటిని కొంటుంటారు. అయితే అవి తినడానికి కాదు.  గుడిలో హోమ గుండాల్లో పడేయడానికి. అలా చేస్తే కష్టాలు ఉండవని నమ్ముతారు.

కానీ, ఈ మధ్యకాలంలో కొందరు బూందీలడ్డును ‘సంకటమోచన బాలాజీ’కి సమర్పిస్తున్నారు. అయితే అలా చేయొద్దని మైకుల్లో అయ్యవార్లు వారిస్తూనే ఉంటారు.  బాల హనుమాన్‌‌ విగ్రహం కాళ్ల దగ్గర ఎప్పుడూ నీరు ప్రవహిస్తుంటుంది. అయ్యగారు ఆ నీటిని ప్రసాదంగా జనాలకు పంచుతాడు. ఆ నీటిని తాగితే మానసిక సమస్యలు దూరం అవుతాయనేది మరో నమ్మకం.

దెయ్యాలతో పంచాయితీ!
ఈ గుడి ప్రాంగణంలో ఆకర్షించే మరో అంశం భైరవ బాబా ఆలయం, ఆ ఆలయంలో జరిగే దెయ్యాల పంచాయితీ.   బాధితుడు(దెయ్యం పట్టిన వ్యక్తి) నేరస్తుడు,  భైరవ బాబా జడ్జి, మధ్యలో అయ్యవారు ఉండి లాయర్‌‌లాగా వాదిస్తుంటాడు. చివరికి బాబా ఆదేశాలతో పవిత్ర జలాన్ని  ఆ వ్యక్తి మీద జల్లి, అతనికి పట్టిన దెయ్యాన్ని తరిమి కొడతాడు పూజారి. అందుకు ప్రతిఫలంగా సదరు వ్యక్తి కుటుంబం భైరవ బాబాకి బియ్యం, మినపప్పు సమర్పించుకుంటుంది. ఈ తతంగం అంతా విచిత్రంగానే అనిపిస్తుంది. 2013లో జర్మనీ, నెదర్లాండ్‌‌, ఢిల్లీ ఎయిమ్స్‌‌, యూనివర్సిటీ ఆఫ్‌‌ ఢిల్లీ నుంచి కొందరు సైకియాట్రిస్ట్‌‌లు, సైంటిస్టులు ఒక గ్రూప్‌‌గా ఏర్పడి ఈ గుడి గురించి, ఇక్కడ చేసే ట్రీట్‌‌మెంట్ గురించి స్టడీ చేశారు కూడా.

గుడి కథ

ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవి. శ్రీ మహంత్‌‌ జీ అనే వ్యక్తికి బాల హనుమాన్‌‌ కలలో కనిపించి తనను పూజించమని చెప్పాడట. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా విగ్రహం కనిపించిందట. దీంతో గుడి కట్టి ఆయన కుటుంబం బాలాజీకి  పూజలు నిర్వహిస్తోంది. అంతేకాదు బాలాజీ విగ్రహం ‘స్వయంభు’ అని చెప్తుంటారు. గతంలో కొందరు ఈ విగ్రహాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తే.. ఎంత తవ్వినా బయటికి రాలేదనే కథ ప్రచారంలో ఉంది. ఈ ఆలయం కాంప్లెక్స్‌‌లో బాలాజీ ఆలయంతో పాటు భైరవ బాబా గుడి,   అంజనా మాతా, కాళీ మాతా, పంచముఖి హనుమాన్‌‌జీ, వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. నార్త్‌‌ ఇండియాలో భూతవైద్యానికి ఫేమస్‌‌గా, ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో ఉంది ఈ గుడి.

 ఇట్లా పోవచ్చు…

రాజస్తాన్‌‌ క్యాపిటల్ జైపూర్‌‌ సిటీకి 110 కిలోమీటర్ల దూరంలో దౌసా జిల్లాలో ఉంది ఈ గుడి. అయితే జైపూర్‌‌ మెయిన్ బస్టాండ్‌‌ నుంచి మెహందీపూర్‌‌ విలేజ్‌‌కి బస్సులు ఫ్రీక్వెంట్‌‌గా ఉంటాయి.  రైల్‌‌, రోడ్డు, ఫ్లైట్‌‌ రూట్స్‌‌లో జైపూర్‌‌కి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మెహందీపూర్‌‌కి బస్‌‌ టికెట్‌‌ 110 రూపాయలు. బాలాజీ మోద్‌‌ చౌరస్తాలో బస్‌‌ దిగాక గుడికి డైరెక్ట్‌‌గా షేర్‌‌ ఆటోలు ఉంటాయి. పది రూపాయలకి బాలాజీ గుడి ముందు దించుతారు ఆటోవాలాలు. గుడి చుట్టుపక్కల అర కిలోమీటర్‌‌ దాకా తినడానికి ఏం దొరకదు. ఆ దూరం దాటి వెళ్తే కొన్ని హోటళ్లలో రోటీ–సేవ్‌‌ టమాటర్‌‌ సాబ్జీ, చాయ్‌‌ మాత్రం దొరుకుతుంది.

Latest Updates