నేను బీజేపీ ట్రాప్‌లో పడను: రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బీజేపీ కాషాయ ముసుగు కప్పే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇటీవలే తమిళులకు ఆరాధ్య కవి తిరువళ్లువర్ విగ్రహానికి ఆ పార్టీ రంగులు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తిరువళ్లువర్ లాగే తనపై కూడా బీజేపీ పెయింట్ వేయాలని చూస్తోందన్నారు. తాను ఆ పార్టీలో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారం వట్టి అబద్ధమని చెప్పారు రజనీకాంత్. తిరువళ్లువర్‌ కానీ, తాను కానీ బీజేపీ ట్రాప్‌లో పడేదిలేదని ఆయన స్పష్టం చేశారు.

గోవాలో జరిగే 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియాలో రజనీకాంత్‌కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు ఇవ్వబోతున్నట్లు ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోడీ సమక్షంలో త్వరలోనే బీజేపీలో చేరుతున్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఆ ప్రచారాన్ని సూపర్ స్టార్ ఖండించారు.

మీడియాతో పాటు కొంత మంది తనను బీజేపీ మనిషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు రజనీ. తాను బీజేపీలో చేరడం లేదని తెలిపారాయన. ఏదైనా  ఒక రాజకీయ పార్టీలో కొత్తగా ఒకరు చేరుతున్నారంటే వాళ్లకు హ్యాపీగానే ఉంటుందన్నారు. కానీ ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది తానేనని గుర్తించాలని చెప్పారు తలైవా. తాను బీజేపీ ట్రాప్‌లో పడనని తెలిపారు. కాగా, అయోధ్య కేసులో తీర్పు ఎలా వచ్చినా దాన్ని అందరూ గౌరవించాలన్నారు రజనీకాంత్. ప్రతి ఒక్కరూ శాంతంగా ఉండాలని కోరారు.

Latest Updates