ప్లాస్టిక్ ను నిషేదించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు..

గాంధీ జయంతి సందర్భంగా… ప్లాస్టిక్ ను నిషేదించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు వివిధ పార్టీల నేతలు, అధికారులు, విద్యార్థులు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తెలంగాణను  తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ లో భాగంగా… రోడ్లపై చెత్తను తొలగించడంతో పాటు మొక్కలను నాటారు.

ప్లాస్టిక్ ను నిర్మూలించాలంటూ…జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించారు మున్సిపల్ సిబ్బంది. గద్వాల పరిధిలోని రాయచూరు  రోడ్డుపై ఉన్న ప్లాస్టిక్, చెత్తను ఏరుతూ ఆదర్శంగా నిలిచారు కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయన్నారు. ప్రజలు ప్లాస్టిక్ ను వాడొద్దని…ప్లాస్టిక్ తో వాతావరణం కాలుష్యమవుతోందన్నారు.

ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం….పర్యావరణాన్ని రక్షిద్దాం పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అవగాహన ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ సిబ్బంది. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ్టి నుంచి ఎవరూ ప్లాస్టిక్  వాడొద్దంటూ పిలుపునిచ్చారు. ర్యాలీలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.జనవరి 26 వరకు ఖమ్మం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా చేస్తామన్నారు ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా…ఖమ్మం నగరంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి…వచ్చే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ సిబ్బంది. కమిషనర్ నర్సయ్య ఆధ్వర్యంలో కళారూపాలతో అవగాహన కల్పించారు. ఇక నుంచి ప్లాస్టిక్ ను వాడబోమంటూ జనంతో ప్రతిజ్ఞ చేయించారు. వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు వాడితే డబుల్ ఫైన్ వేస్తామని హెచ్చరించారు.

జగిత్యాల జిల్లా ధర్మపురిలోనూ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థులు, జాగృతి సభ్యులు.  ధర్మపురి కూరగాయల మార్కెట్ లో ప్లాస్టిక్ వాడొద్దంటూ… ఉచితంగా చేతి సంచులను పంపిణీ చేశారు. ధర్మపురిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

 

అటు కొమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లాకేంద్రంలోనూ ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ అవగాహన ర్యాలీ జరిగింది. పట్టణంలోని ప్రధాన వీధులగుండా ర్యాలీ చేపట్టారు. తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి…పర్యావరణాన్ని కాపాడతామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ సక్కు పాల్గొన్నారు. అటు కాగజ్ నగర్ లో ప్లాస్టీక్ ను నిషేదించాలంటూ హోటళ్లు, దుకాణాల్లో వినూత్నంగా ప్రచారం చేశారు మున్సిపల్ అధికారులు.

Latest Updates