బండారి బ్యాట్ పట్టు.. రికార్డులు కొట్టు

టీమిండియా బ్యాట్స్​మెన్లు క్రీజులో ఉన్నారంటే చాలు.. ప్రత్యర్ధి బౌలర్లు ఆచితూచి బౌలింగ్​ చేస్తారు. పుసుక్కున ఆ బ్యాటుకు బంతి దొరికిందంటే.. చాలు మనోళ్లు బౌండరీ బాదేస్తారు మరి. అయితే.. మనోళ్లు కొట్టే బౌండరీల వెనుక ఓ సిద్ధహస్తుడి కష్టం కూడా ఉంది. కోహ్లీ, రోహిత్​ శర్మలతో పాటు టీమిండియా ఆటగాళ్లు వినియోగించే బ్యాట్ల రిపేర్​, తయారీ అన్నీ చేసే ఓ వ్యక్తిని ఈరోజు పరిచయం చేసుకుందాం!

ఓ ఇంటర్నేషనల్​ మ్యాచ్​లో సచిన్​ అవతలి టీమ్​ బౌలర్ల బౌలింగ్​ని చితక్కొట్టాడు. ఫలితంగా మనదేశం ఆ మ్యాచ్​లో గెలిచింది.  ఆ తర్వాత అందరూ సచిన్​ బ్యాట్​లో ఏదో మహత్తు ఉందన్నారు. అయితే.. అక్కడున్న అసలు విషయమేంటంటే.. అప్పటి వరకు సచిన్​ బ్యాట్​బరువు 1350  గ్రాములు. రామ్​ భండారీ అనే  బ్యాట్లు రిపేర్​ చేసే వ్యక్తి  ఆ  బరువును 1250 గ్రాములకు తగ్గించాడు.  అది తెలిసి సచిన్​ కూడా ఆశ్చర్యపోయాడు. బరువు తగ్గినా.. బ్యాట్​లో గ్రేస్​ ఏ మాత్రం తగ్గకపోవడం చూసి రామ్​ భండారిని కలుసుకోకుండా ఉండలేకపోయాడు. బ్యాట్​ భారం తగ్గించి.. పరుగులు పెరిగేలా చేసిన రామ్​ భండారి గురించి తెలుసుకోకపోతే ఎట్ల?

భండారి.. భలే బ్యాటుకాడు..

బెంగళూరులోని ఉత్తరహల్లి అనే ప్రాంతంలో ఉంటాడు. సొంతూరు బీహార్​లోని భికన్​ తోరి అనే టౌన్. పెద్దగా చదువుకోలేదు. ఏదైనా పని చేసుకుందామని బెంగళూరుకు వచ్చాడు.  తాత నుంచి నేర్చుకున్న వడ్రంగి పని మాత్రమే తెలుసు. అదే తనకు తిండి పెడుతుందని  అర్థమైంది.  బాగా ఆలోచించి స్పోర్ట్స్​ ఐటమ్స్​ అమ్మే షాప్​ పెట్టాడు. ఒకవైపు ఆట వస్తువులు అమ్ముతూ.. బ్యాట్లు తయారుచేయడం, డ్యామేజ్​అయిన బ్యాట్లు రిపేరు చేయడం పనిగా పెట్టుకున్నాడు. క్రమంగా భండారి చేసే బ్యాట్లకు డిమాండ్​ పెరిగింది. జూనియర్​ క్రికెటర్లంతా భండారి దగ్గరే బ్యాట్లు కొనుక్కునేవారు. కొన్నిరోజుల తర్వాత బ్యాట్​డ్యామేజ్​ అయితే.. రిపేర్​ కోసం భండారి దగ్గరికే వచ్చేవాళ్లు. భండారి తన అనుభవంతో పాడైపోయిన బ్యాట్​ను తిరిగి కొత్త బ్యాట్​లా మార్చి ఇచ్చేవాడు. క్రమంగా భండారి గురించి సీనియర్​ క్రికెటర్లకు తెలిసింది. సీనియర్​ క్రికెటర్లు కూడా భండారి దగ్గర బ్యాట్లు రిపేర్​ చేయించుకునేవారు. ఓ దశలో ఆయన తయారుచేసిన బ్యాట్​తో మాత్రమే ఆడారు కూడా.

మహామహులే క్యూ కట్టారు..

ఇది అక్కడితో ఆగలేదు.. మెల్లమెల్లగా రంజీ ట్రోఫీ క్రికెటర్లు కూడా భండారి బ్యాట్లకు ఫ్యాన్స్​ అయిపోయారు. అదే సమయంలో అప్పటి స్టార్​ క్రికెటర్​, మిస్టర్​ వాల్ రాహుల్​ ద్రవిడ్​తో భండారికి పరిచయమైంది. ఆ పరిచయంలో భాగంగా ఒకసారి రాహుల్​ ద్రవిడ్​ తన పాడైపోయిన బ్యాట్​ని రిపేర్​ చేయమని భండారికి ఇచ్చాడు. ఆ బ్యాట్​ను మరమ్మత్తు చేసి కొత్తదానిలా రూపురేఖలు మార్చేశాడు భండారి.  అది రాహుల్​కి బాగా నచ్చడంతో అప్పటి నుంచి తన బ్యాట్ల రిపేర్​ పూర్తిగా అతనికే అప్పజెప్పాడు. రాహుల్​తో పాటు సౌరవ్​ గంగూలీ, సచిన్​ టెండూల్కర్​ కూడా భండారి దగ్గరే బ్యాట్లు రిపేర్​ చేయించుకునేవారు. ఒక్కసారి భండారి చెయ్యి పడిన బ్యాట్​ పడితే.. వేరే బ్యాట్​ పట్టుకోవడానికి మనసొప్పదు. బ్యాట్​ తయారీ, రిపేరు చేయడంలో అంతటి ఎక్స్​పర్ట్​ అతను.

మన ఆటగాళ్లకు..

బ్యాట్స్​మెన్​ తన బ్యాట్​ ఎలా ఉండాలనుకుంటున్నాడో ఒక్కసారి చెప్తే చాలు.. అచ్చం అలాగే.. ఏ మాత్రం తేడా లేకుండా బ్యాట్​ తయారుచేయడం, రిపేర్​ చేయడం భండారి స్పెషాలిటీ. ప్లాస్టరింగ్​, సీజనింగ్​, బ్యాలెన్సింగ్​ ఏదైనా సరే.. బ్యాట్స్​మెన్​ కోరుకున్నట్టుగా బ్యాట్​ రూపొందించడం భండారికి తెలిసిన విద్య. బ్యాట్​తో మైదానంలో సిక్సులు, ఫోర్లు బాదాలంటే దాని బరువు, బ్యాలెన్స్​, స్ట్రోక్​, వంపు చాలా ముఖ్యం. బ్యాట్స్​మెన్​ బరువు, ఎత్తును బట్టి బ్యాట్​ ఎలా ఉండాలో చిటికెలో చెప్పేస్తాడు భండారి. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్​కప్​లో టీమిండియా ఆటగాళ్లు ఆడే బ్యాట్ల రిపేర్​ రామ్​ భండారియే​ చేస్తున్నాడు.  కోహ్లీ, రోహిత్​ ఈ వరల్డ్​ కప్​లో తమకు కావల్సినట్టుగా దగ్గరుండి మరీ భండారీతో బ్యాట్​ తయారు చేయించుకున్నారు.

విదేశీ క్రికెటర్లకు…

రికీపాంటింగ్​, దిల్షాన్​, చంద్రపాల్​ వంటి విదేశీ​ క్రికెటర్లు సైతం భండారి దగ్గర తమ బ్యాట్​కు మెరుగులు దిద్దించుకుంటారు. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికీ భండారి దగ్గరే తమ బ్యాట్లు రిపేర్​ చేయించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా తనకు ఇంత క్రేజ్​ ఉన్నప్పటికీ భండారి మాత్రం ‘నాకు డబ్బు ముఖ్యం కాదు. బ్యాట్​ తయారుచేయడం, ఆటగాడికి నచ్చేలా దాన్ని డిజైన్​ చేయడం నా పని. బ్యాట్​ అద్భుతంగా తయారుచేశాడు అనిపించుకోవడం నాకు ప్యాషన్​. నేను చేసిన పని ఆటగాడికి నచ్చితే నాకు అదే చాలు’ అంటూ సంతృప్తి పడతాడు.

Latest Updates