నేషనల్ అవార్డ్ గెలిచిన తెలుగోడు

రీసెంట్‌‌‌‌గా  నేషనల్ ఫిల్మ్‌‌‌‌ అవార్డ్స్ అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలుసు. అందులో మన తెలుగువాళ్లకు నాలుగైదు అవార్డులొచ్చిన సంగతీ తెలుసు. కానీ చాలామందికి తెలియని  మరో విషయం ఏంటంటే.. ఆ  లిస్ట్‌‌‌‌లో మన హైదరాబాద్‌‌‌‌కు చెందిన మరో తెలుగబ్బాయి కూడా ఉన్నాడు. అతనే రమణ దుంపల.. అతను తీసిన ‘గ్లో వామ్ ఇన్ ఎ జంగిల్’ అనే ఫిల్మ్‌‌‌‌కు ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్’గా నేషనల్ అవార్డ్ వచ్చింది. అందరిలాగా షార్ట్ ఫిల్మ్స్‌‌‌‌తో స్టార్ట్ చేసి, నేషనల్ అవార్డు దాకా వెళ్లిన రమణ గురించి అతని మాటల్లోనే…

నేషనల్ అవార్డు రావడం ఎలా అనిపించింది?

చాలా హ్యాపీగా ఉంది. నేషనల్ అవార్డు  రావొచ్చేమో అని నేను ముందే ఊహించాను. ఎందుకంటే.. నేషనల్ అవార్డు కంటే  ముందే  చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌‌‌లో నా డాక్యుమెంటరీ ప్లే అయింది. అందుకే అంత ఎగ్జైట్‌‌‌‌మెంట్ ఏమీ లేదు.

పుట్టి పెరిగింది ఎక్కడ?

నేను పుట్టింది శ్రీకాకుళంలో.. కానీ మా ఫాదర్ ‘సీఐయస్ఎఫ్’ లో పని చేసేవారు. అదొక ఆర్మీ ఫోర్స్.. ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువ.  అలా చిన్నప్పుడు చాలా చోట్లకు తిరిగి, తిరిగి చివరగా హైదరాబాద్‌‌‌‌లో సెటిల్ అయ్యాం.

ఫిల్మ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

నేను హైదరాబాద్‌‌‌‌లో బీటెక్ చదివేటప్పుడు కాలేజీలో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ జరిగేవి. నేను మా ఫ్రెండ్స్ సరదాగా వాటిల్లో పార్టిసిపేట్ చేసేవాళ్లం. సినిమాలంటే ఇంటరెస్ట్ తప్ప, అంతకు మించి సినిమా నాలెడ్జ్ ఏమీ లేదు. కెమెరా ఎలా పట్టుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా తెలీదు. అయినా ఏదో ఇంట్రెస్ట్ కొద్దీ  షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం. అయితే కాంపిటీషన్స్‌‌‌‌లో మా షార్ట్ ఫిలిమ్సే ఫస్ట్ వచ్చేవి. దాంతో మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది.  ప్రతి ఈవెంట్‌‌‌‌లో పార్టిసిపేట్ చేస్తూ, ఫస్ట్ వచ్చే వాళ్లం. అలా షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చిన బూస్ట్‌‌‌‌తో  ఫిల్మ్ మేకింగ్‌‌‌‌ని సీరియస్‌‌‌‌గా తీస్కోవాలనిపించింది. అలాగే ఎఫ్‌‌‌‌టిఐఐ(ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)లో జాయిన్ అవ్వాలనేది నా డ్రీమ్. అందుకే తర్వాత బాగా ట్రై చేసి ‘ఎఫ్‌‌‌‌టిఐఐ’లో సీట్ సంపాదించా.

‘ఎఫ్‌‌‌‌టిఐఐ’లో లైఫ్ ఎలా ఉంది?

నేను ఊహించినట్టే చాలా బాగుంది. అదొక ప్రపంచం.. అక్కడ ఎటు చూసినా ఫిల్మ్ మేకర్సే ఉంటారు. క్యాంపస్‌‌‌‌లో మాట్లాడే ప్రతీ మాటా సినిమా గురించే ఉంటుంది. ఆ సినిమా ప్రపంచం నాకు చాలా నచ్చింది. అంతే కాకుండా అదొక క్రాస్ కల్చర్ ప్లాట్‌‌‌‌ఫాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లుంటారు. డిఫరెంట్ కల్చర్స్ అక్కడ కనపడుతుంటాయి. ఆ మూడేళ్లు క్లాస్ రూంలో కన్నా.. క్యాంపస్‌‌‌‌లోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నా… నేషనల్ అవార్డు వచ్చిన డాక్యుమెంటరీ కూడా ఎఫ్‌‌‌‌టిఐఐ లో ఉన్నప్పుడు తీసిందే… ఎఫ్‌‌‌‌టిఐఐ  ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా  డాక్యుమెంటరీ తీయాల్సి వచ్చింది. అలా తీసిందే.. ‘గ్లో వామ్ ఇన్ ఎ జంగిల్’ డాక్యుమెంటరీ.

ఆ డాక్యుమెంటరీ దేని గురించి?

పూణేలో ‘హేమ సానే’ అనే 80 ఏళ్ల ముసలావిడ అడవిలో ఎలక్ట్రిసిటీ కూడా  లేకుండా నేచురల్‌‌‌‌గా ఎన్నో ఏళ్లుగా జీవిస్తుంది. ఆమె బోటనీలో పిహెచ్‌‌‌‌డి చేసింది. ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌గా కొంతకాలం పని చేసి, తర్వాత ప్రకృతి మీద ప్రేమతో రెగ్యులర్ లైఫ్‌‌‌‌ని వదిలేసి నేచర్‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా అడవిలో ఉంటోంది. చిన్న గుడిసెలో ఉంటూ.. చెట్లు , పక్షుల మధ్య పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా బతకడమే ఆమె ప్రత్యేకత. ఆమె బయోగ్రఫీనే నా డాక్యుమెంటరీ.

ఆ సబ్జెక్టే ఎందుకు తీసుకోవాలనిపించింది?

నాకు కూడా చిన్నప్పటి నుంచి నేచర్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్‌‌‌‌టైం హేమసానే గారి గురించి వినగానే ఎంతో ఇన్‌‌‌‌స్పైరింగ్‌‌‌‌గా అనిపించింది.  ఆమె లైఫ్‌‌‌‌స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. అక్కడికెళ్లి చూశాక ఇంతకంటే మంచి సబ్జెక్ట్ ఉండదనిపించింది. అందుకే  దాన్నే డాక్యుమెంటరీ రూపంలో తీశాను.

షూటింగ్‌‌‌‌లో  ఏవైనా ఇబ్బందులు ఫేస్ చేసారా?

డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌‌‌‌కి, రెగ్యులర్ ఫిల్మ్స్‌‌‌‌కి  చాలా తేడా ఉంటుంది. ఇందులో యాక్టింగ్ ఉండకూడదు. జరుగుతున్నది జరుగుతున్నట్టుగా  షూట్ చేయాలి. విజువల్స్ రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అందుకే ఆమె దగ్గరకు ముందుగానే వెళ్లి, ఆమెతో పరిచయం పెంచుకుని, ఆమెకు ఫ్రెండ్ అయ్యాను. తర్వాత ఆమెతో పాటే ఉండి, షూటింగ్ పూర్తి చేశాను. షూట్ జరిగినన్ని రోజులు నేచర్‌‌‌‌‌‌‌‌తో కలిసి జీవించడం చాలా కొత్త  ఎక్స్‌‌‌‌పీరియన్స్ ఇచ్చింది.

నెక్స్ట్ సినిమాలా? డాక్యుమెంటరీలా ?

రెండూ చేస్తాను. నాకు సినిమా, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ అన్న తేడా ఏమీ లేదు. నేనొక స్టోరీ టెల్లర్‌‌‌‌‌‌‌‌ని. ఇవన్నీ స్టోరీ టెల్లింగ్‌‌‌‌లో రకరకాల పద్ధతులు. నేను ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌లో సినిమాల మీద దృష్టి పెట్టినా.. వాటితో  పాటు డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తాను.

ఇప్పుడొస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయి?

అలా అడిగితే చెప్పలేను.. కానీ నా దృష్టిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ  ఇతర ఇండస్ట్రీలకన్నా పెద్దది. నేను ఎఫ్‌‌‌‌టిఐఐలో చదువుతున్నప్పుడు అక్కడ రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు పరిచయమయ్యేవాళ్లు. వాళ్లలో చాలామంది ‘ మా స్టేట్‌‌‌‌లో అసలు ఫిల్మ్  ఇండస్ట్రీ అనేదే లేదు’ అని చెప్పేవాళ్లు.  కానీ తెలుగు ఇండస్ట్రీ అలా కాదు. బాలీవుడ్ తర్వాత ఆ రేంజ్‌‌‌‌లో మార్కెట్ ఉంది. అయినా మన ఇండస్ట్రీలో కంటెంట్ బేస్డ్ మూవీస్ తక్కువ. మార్కెట్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ సినిమాలే  ఎక్కువ వస్తున్నాయి. కమర్షియల్‌‌‌‌గా సినిమాలు తీయడం కూడా మంచిదే. కానీ మంచి కంటెంట్‌‌‌‌తో ఇంటర్‌‌‌‌‌‌‌‌నేషనల్ స్థాయికి వెళ్లగలిగే టాలెంట్ కూడా తెలుగు సినిమాకు ఉంది. దాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

ఇండస్ట్రీలో ఎవరైనా తెలుసా?

కాలేజీలో ఉన్నప్పుడు  ఒక ఈవెంట్‌‌‌‌కి శ్రీకాంత్ అడ్డాల గారు గెస్ట్‌‌‌‌గా వచ్చినపుడు నా వర్క్ చూసి అసిస్టెంట్‌గా చేస్తావా అని అడిగారు. అప్పుడు నాకు ఎఫ్‌‌‌‌టిఐఐలో జాయిన్ అవ్వడం ఒక డ్రీమ్. అందుకే వెళ్లలేదు. నాకు సుజిత్ కూడా మంచి ఫ్రెండ్.   తను ‘రన్ రాజా రన్’ తీసిన తర్వాత ప్రభాస్‌‌‌‌కి స్టోరీ రెడీ చేస్తున్నాడు. అప్పుడు నేను కూడా స్క్రిప్ట్ లో హెల్ప్ చేశా.. ఆ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడే నాకు ఎఫ్‌‌‌‌టిఐఐ లో సీట్ వచ్చింది. అది నా డ్రీం కాబట్టి.. సాహోని వదిలేయాల్సి వచ్చింది.

మీరు తీసే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి?

నేను కమర్షియల్ కన్నా కంటెంట్‌‌‌‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు అవే బాగా కనెక్ట్ అవుతాయి. ఇంటర్‌‌‌‌‌‌‌‌నేషనల్‌‌‌‌ స్థాయిలో తెలుగు సినిమా గురించి తెలియాలనేదే నా కోరిక..

ఫ్యూచర్‌‌ ఫిల్మ్ మేకర్స్‌‌కు మీరిచ్చే సలహా..?

నేను సలహాలిచ్చేంత వాడ్ని కాదు., కానీ నా కోరిక ఏంటంటే… ప్రతీ ఫిల్మ్ మేకర్ సినిమాను  ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీలవ్వాలి. చాలామందికి సినిమాలంటే చిన్న చూపు ఉంటుంది. ఆ ఆలోచన పూర్తిగా మారాలి. సినిమా కూడా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ మీడియం.. దాన్ని సరిగ్గా వాడుకోగలగాలి. అందుకే ఫిల్మ్ మేకర్స్ అవ్వాలనుకునే వాళ్లు సినిమాను ఒక మార్కెట్‌‌‌‌లా కాకుండా.. రెస్పాన్సిబుల్‌‌‌‌గా ఫీలయితే బాగుంటుంది. -నాగ తిలక్‌

Latest Updates