రంజాన్ పండుగ: సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

ramzan-festival-traffic-restrictions-in-the-city

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనల కారణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇటువైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనలకు వచ్చే వారు పురాణాపూల్, కామటిపురా, కిషన్ బాగ్, బహదూర్ పురా  క్రాస్ రోడ్ మీదుగా రావాలని సూచించారు. ఈ సమయంలో సాధారణ వాహనాలను బహదుర్ పురా క్రాస్ రోడ్డు మీదుగా.. కిషన్ బాగ్ లేదా కామటిపురా వైపు మళ్లిస్తారు. శివరాంపల్లి, ఎన్ పీఏ నుంచి వచ్చే వాహనాలను బహదూర్ పురా క్రాస్  రోడ్డు మీదుగా ధనమ్మ హట్స్, టీ జంక్షన్, అలియాబాద్  వైపు మళ్లిస్తారు. ప్రార్థనల కోసం వచ్చేవారి వాహనాలకు జూపార్క్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా ఆ మార్గంలో వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ పై మాత్రమే వెహికిల్స్ అనుమతిస్తున్నారు. కింది నుంచి ఎటువంటి వాహనాలను అనుమతించట్లేదు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి పదకొండున్నర వరకు అమలులో ఉంటాయన్నారు సీపీ అంజనీ కుమార్.

రంజాన్ ప్రార్థనలు ముగిసిన తర్వాత ఈద్గాల నుంచి వచ్చే వాహనాలతో పురాణాపూల్ వద్ద రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున.. సిటీ కాలేజీ వైపు వాహనాలు మళ్లిస్తారు. ద్విచక్ర వాహనాలను మీరాలం ఎక్స్ రోడ్డు వరకే అనుమతిస్తారు. వాహనాలను పార్క్ చేసేందుకు ప్రత్యేక పార్కింగ్  స్థలాలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఈద్గా దగ్గర బ్రూక్ బాండ్ సెంటర్ నుంచి సీటీవో ఆఫీస్ మీదుగా వచ్చే వాహనాలను ఈద్గా క్రాస్ రోడ్డు నుంచి తాడ్ బంద్  వైపు మళ్లిస్తున్నారు. ప్రజలందరూ సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సీపీ సూచించారు.

Latest Updates