రంజన్ గొగోయ్ తీర్పుల్లో నేర్పరి

ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి చీఫ్​ జస్టిస్​ ఆఫ్​ ఇండియా(సీజేఐ)గా బాధ్యతలు చేపట్టి, రేపు రిటైర్​ కానున్న జస్టిస్​ రంజన్​ గొగోయ్​.. ఈ 13 నెలల కాలంలోనే దేశ న్యాయ వ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. పోయినేడాది అక్టోబర్​ 3న సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు నిజానికి ఈ నెల 17న(ఆదివారం) లాస్ట్​ వర్కింగ్​ డే. కానీ ఈ రోజు (శనివారం) కోర్టు ప్రొసీడింగ్స్​ జరగవు. ఆదివారం సెలవు. దీంతో రంజన్​ గొగోయ్​ శుక్రవారమే చివరి రోజుగా కోర్టు​ నంబర్​–1లోని తన కుర్చీలో కూర్చున్నారు.

సుప్రీంకోర్టులోని కోర్టు​ నంబర్​–1 అంటే సీజేఐ కోర్టు రూమ్​ అని అర్థం. శుక్రవారం అక్కడ ఆయన కేవలం నాలుగు నిమిషాలే గడిపారు. ఆ టైమ్​లో గొగోయ్​తోపాటు కాబోయే సీజేఐ ఎస్​ఏ బోబ్డే, సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ రాకేశ్​ ఖన్నా ఉన్నారు. బార్​ అసోసియేషన్​ తరఫున రాకేశ్​ ఖన్నా చీఫ్​ జస్టిస్​కి థ్యాంక్స్​ చెప్పారు. శుక్రవారం చివరి వర్కింగ్​ డే కావటంతో గొగోయ్​ రాజ్​ఘాట్​కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.

ఎన్​ఆర్​సీకి డెడ్​లైన్​ పెట్టారు

1954 నవంబర్​ 18న పుట్టిన రంజన్​ గొగోయ్​.. అస్సాం మాజీ సీఎం కేశబ్​ చంద్ర గొగోయ్​ కొడుకు. 1978లో ‘బార్’లో జాయినై గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్​ చేశారు. 2001లో పర్మనెంట్​ జడ్జి అయ్యారు. 2010​లో పంజాబ్​ అండ్​ హర్యానా హైకోర్టుకి ట్రాన్స్​ఫర్​పై​ వచ్చారు. ఏడాది తర్వాత చీఫ్​ జస్టిస్​గా నియమితులయ్యారు. 2012​లో సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్​ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జి అయినప్పటి నుంచే రంజన్​ గోగోయ్​ ఎన్నో మార్పులకు కారణమయ్యారు. ఎన్​ఆర్​సీ ప్రక్రియను మూడేళ్లలో పూర్తిచేయాలంటూ 2014లో కేంద్రాన్ని ఆదేశించిన ఇద్దరు జడ్జిల్లో ఈయనొకరు. రిటైరయ్యాక గౌహతిలోనే సెటిలవనున్నారు.

ఫాస్ట్ ట్రాక్​’లోకి తెచ్చారు​

జ్యుడీషరీతోపాటు సుప్రీంకోర్టు రెజిస్ట్రీలో రంజన్​ గొగోయ్​ ఎన్నో ర్యాడికల్​ మార్పులు చేపట్టారు. కేసులు ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉండకుండా​ ఫాస్ట్​గా విచారణకు రావటానికి రూట్ ​క్లియర్​ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 31 నుంచి 34కి పెంచారు. ఈ ఏడాది సెప్టెంబర్​ 23 నాటికే వీరంతా నియమితులయ్యారు. ఎక్కువ మంది హైకోర్టు చీఫ్​ జస్టిస్​లకు సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమోషన్​ ఇచ్చిన ఘనత రంజన్​ గొగోయ్​కే దక్కింది. పర్మనెంట్​ కాన్​స్టిట్యూషన్​ బెంచ్​ని ఏర్పాటుచేస్తారనే వార్తలు కూడా ఈయన హయాంలోనే వచ్చాయి.

అన్ని వర్గాల నుంచి ప్రశంసలు

లేటెస్ట్​గా.. పిటిషన్ల ట్రాన్స్​ఫర్​ కేసుల్లో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సింగిల్​ జడ్జిలకే కట్టబెట్టారు. ‘ఏడేళ్లలోపు బెయిల్’​కు సంబంధించిన అంశాన్నీ వాళ్ల పరిధిలోకే తెచ్చారు. సుప్రీంకోర్టు సహా మొత్తం జ్యుడీషరీపై ఆయన జరిపిన సమగ్ర పరిశీలన అద్భుతమని న్యాయ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. 13 నెలల పదవీ కాలాన్ని రంజన్​ గొగోయ్ పూర్తిగా వినియోగించుకున్నారని, సుప్రీంకోర్టు చరిత్రలో ఇలాంటి చీఫ్​ జస్టిస్​ ఈయన ఒక్కరేనని చెబుతున్నాయి. గడచిన పాతికేళ్లలో పలువురు జడ్జిలు సీజేఐలుగా పనిచేశారు. కొందరు ఈ పదవిలో కొన్ని నెలలే ఉన్నారు. మరికొందరు ఏడాది పాటు కొనసాగారు. కేజీ బాలకృష్ణన్​ మాత్రమే మూడేళ్లకు పైగా ఉన్నారు. కానీ.. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని సంస్కరణలను అమలుచేసిన సీజేఐ జస్టిస్​ రంజన్​ గొగోయ్​ మాత్రమేననే అభిప్రాయం న్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయన చేపట్టిన ఈ రిఫార్మ్స్​ ప్రభావం దేశ న్యాయ వ్యవస్థపై కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందని అంటున్నారు.

Latest Updates