పదేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు…

  • బాలికపై లైంగిక దాడికి యత్నించిన స్వీపర్​ 
  • పాఠశాల ముందు బాలిక బంధువుల ధర్నా
  • వృద్ధుడిని చితకబాది పోలీసులకు అప్పగింత

గోదావరిఖని, వెలుగు: పదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడో 60 ఏళ్ల వృద్ధుడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు స్కూల్‌కు వెళ్లి నిలదీయగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ కామాంధుడిని చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గోదావరిఖనిలోని ఓ బడిలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై అదే బడిలో స్వీపర్‌గా చేస్తున్న సర్వర్  శనివారం అత్యాచార యత్నం చేశాడు. దీంతో భయపడిని చిన్నారి సోమవారం బడికిపోనంది. తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయగా  భయంతో ఏడుస్తూ శనివారం జరిగిన విషయం తెలిపి ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించినట్లు వివరించింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు బంధువులతో కలిసి బడికి వచ్చి సర్వర్‌ను నిలదీశారు. అతడు తత్తరపడుతూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా చితకబాదారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులకు అప్పగించారు.

స్థానిక సీఐ పర్శ రమేష్, మండల విద్యాశాఖ అధికారి డానియల్ విచారణ జరిపారు. జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశంతో వెంటనే సర్వర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్  స్కూల్‌కు వచ్చి టీచర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Latest Updates