పంజాబ్లో ఆరేళ్ల దళిత చిన్నారిపై రేప్.. ఈ ఘటనపై గాంధీలు మాట్లాడరా?

రేప్ చేసి బతికుండగానే కాల్చేసిన్రు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితేనే స్పందిస్తరా?
రాహుల్, ప్రియాంకలపై కేంద్ర మంత్రులు నిర్మల, జవదేకర్ ఫైర్

న్యూఢిల్లీ: పంజాబ్ హోషియార్పూర్లోని తాండా గ్రామంలో దారుణం జరిగింది. ఆరేళ్ల దళిత చిన్నారిని కామాంధులు రేప్ చేసి, బతికుండగానే కాల్చేశారు. బుధవారం ఈ దారుణం చోటు చేసుకోగా.. నిందితులు సుర్ ప్రీత్, అతడి తాత సుర్జీత్ సింగ్ లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బిస్కెట్లు కొనిస్తానని ఆశపెట్టి తన బిడ్డను సుర్ ప్రీత్ సింగ్ తీసుకెళ్లాడని ఆ చిన్నారి తండ్రి ఆరోపించాడు. బిడ్డ ఇంటికి రాకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సుర్ ప్రీత్ సింగ్ పేరును ఫిర్యాదులో చేర్చారు. పోలీసులు అదే రోజు మధ్యాహ్నం సుర్ ప్రీత్ సింగ్ ఇంటి ఆవరణలోని పశువుల కొట్టంలో సగం కాలిన చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుర్ ప్రీత్ ను, అతడి తాత సుర్జీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ఎస్సీ కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఘటనపై సోమవారం లోగా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా హోషియార్ పూర్ ఎస్పీని ఆదేశించింది.

గాంధీలు నోరెత్తరేం..?
యూపీలోని హత్రాస్ లో జరిగిన రేప్ ఘటనపై హల్ చల్ చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలు హోషియార్పూర్లో అత్యాచారం, హత్య ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చిన్న ఘటన జరిగినా ట్వీట్లు చేసి రాజకీయం చేసే రాహుల్ గాంధీ.. పంజాబ్ ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిర్మల ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో ఘటనలు జరిగితే ‘పిక్నిక్’లకు వెళ్లే అన్నాచెల్లెళ్లు ఇప్పుడు పంజాబ్కు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందుకే మాట్లాడటం లేదన్నారు. పంజాబ్లో బీహార్ బాలిక చనిపోయినా రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లీడర్ తేజస్వీ యాదవ్ కనీసం మాట్లాడలేదని నిర్మల విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ను ఘటనపై నిలదీశావా అంటూ తేజస్వీని ప్రశ్నించారు. అయినా, రేప్ కేసులున్న ఆ ఇద్దరు అన్నదమ్ములు ఇలాంటి ఘటనలపై ఎందుకు మాట్లాడతారంటూ మండిపడ్డారు.

ఫోజులిచ్చేందుకే హత్రాస్ కు..
హోషియార్పూర్ ఘటన చాలా దారుణమని, తనను షాక్కు గురి చేసిందని మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఘటనపై ఇప్పటిదాకా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఒక్క మాటైనా మాట్లాడలేదని మండిపడ్డారు. హత్రాస్ఘటనలో బీజేపీపై నానా యాగీ చేసిన రాహుల్.. రాజకీయ టూర్లకు పోయే బదులు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బాధితులను పరామర్శించాలని సూచించారు. ఫొటోలకు పోజులిచ్చేందుకే హత్రాస్ ఘటనను రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయం చేస్తున్నరు: పంజాబ్ సీఎం
హోషియార్ పూర్ ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోందని పంజాబ్సీఎం అమరీందర్ సింగ్ విమర్శించారు. హత్రాస్ ఘటనలో యూపీ సర్కార్ తీరు సరిగ్గా లేకపోవడం వల్లే కాంగ్రెస్ నిలదీసిందన్నారు. తాండా ఘటనపై తమ ప్రభుత్వం వెంటనే స్పందించిందని, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారని చెప్పారు.

యూపీలా చేస్తే.. ఇక్కడకూ వెళ్తా: రాహుల్
యూపీలో మాదిరిగా పంజాబ్, రాజస్థాన్ లలో రేప్ సంఘటనలను ప్రభుత్వాలు తిరస్కరించడం లేదని, బాధితులకు న్యాయం జరిగేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘యూపీలో హత్రాస్ రేప్ ఘటన తర్వాత పది రోజులకు ఫోరెన్సిక్ శాంపిళ్లు సేకరించి టెస్టులు చేశారు. వీర్యం ఆనవాళ్లు దొరకలేదు కాబట్టి రేప్ జరగలేదని పోలీసులు చెప్పారు. కానీ పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను న్యాయం జరగకుండా చేయడం లేదు. ఒకవేళ యూపీలో మాదిరిగా చేస్తే ఇక్కడకూ వెళ్తా. బాధితులకు న్యాయం జరిగేందుకు కొట్లాడతా..” అని రాహుల్ ట్వీట్ చేశారు.

For More News..

ప్రతి ప్లాటుకు ఎల్ఆర్ఎస్.. టార్గెట్ 25 లక్షల ప్లాట్లు

హైదరాబ్యాడ్ షో.. ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్

జూన్లో కరోనా వ్యాక్సిన్ ఖాయం

Latest Updates