ప్రేమ ముసుగులో రేప్.. పెళ్లిచేసుకొమ్మంటే పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. వారం రోజుల క్రితం ఉన్నావ్ జిల్లాలో కొందరు దుండగల చేతిలో యువతి సజీవ దహన ఘటన మరువక ముందే..  శనివారం అదే రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు 18 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెని వదిలించుకొనేందుకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆ బాలిక ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతోంది.

ఫతేపూర్ జిల్లాకి చెందిన ఆ బాలిక(18),  వరుసకి మామ అయ్యే ఓ యువకుడి(22)ని ప్రేమించింది. ప్రేమ పేరుతో ఆ యువకుడు బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా కలిశారు. ఆ తర్వాత మొహం చాటేయడంతో బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో ఇరు కుటుంబాలు పంచాయతీ పెట్టి వారి పెళ్లి జరిపేట్టుగా సెటిల్‌మెంట్ చేసుకున్నారు. మొదటి నుంచి బాలికను పెళ్లి చేసుకునేందుకు ఇష్టం లేని అతను ఆమెను అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. శనివారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు.

మంటలు తట్టుకోలేని బాలిక సహాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులు విన్న పొరుగింటివారు ఆమెను వెంటనే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం కాన్పూర్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో ఆ బాలిక ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో నిందితుణ్ని పట్టుకోవడానికి రంగంలోనికి దిగారు.

5 టీమ్ లుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నారు. ఈ విషయాన్ని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఓ పోలీస్ అధికారి మీడియా కి తెలిపారు. హుస్సింగాంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

Latest Updates