110 ఏళ్ల బామ్మకు అరుదైన శస్త్ర చికిత్స

చంఢీఘర్‌లోని PGIMER హాస్సిటల్‌లో 110 ఏళ్ల బామ్మకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. కొంతకాలం కిందట ఇంట్లో కిందపడిన వృద్ధురాలు తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చేరింది. అప్పటినుంచి ఆ ఎముక అతుకకపోవడంతో, ఆమెకు ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. అందులో భాగంగా ఆమెకు జనవరి 8న ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆమె ఇప్పుడు ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటుంది.

‘ఇంత వయసున్నమహిళకు ఇటువంటి శస్త్ర చికిత్స చేయడం చాలా అరుదైన విషయం. ఇంతకుముందు మేము 101 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు ఈ శస్త్ర చికిత్న నిర్వహించాము. ఇటువంటి పరిస్థితులలో రోగికి ఆపరేషన్ చేయకపోతే వారి జీవితకాలం తగ్గుతుంది మరియు జీవన విధానం దెబ్బతింటుంది. రోగికి ఆపరేషన్ చేయకపోతే మంచానికే పరిమితమై.. ఇన్ఫెక్షన్ సోకి మరణించే అవకాశముంటుంది. ఇదిలా ఉండగా.. ఇంత వయసున్న వారికి ఆపరేషన్ చేయడం కూడా ప్రమాదకరమే. మహిళకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించడంతో.. ఆమె కోలుకొని మళ్లీ నడవడానికి ప్రయత్నిస్తుంది’ అని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ విజయ్ గోని తెలిపారు. వయసు ఎక్కువగా ఉండటం వల్ల వారి ఎముకలు పెళుసుగా ఉంటాయి, అటువంటి వారికి ఇలాంటి ఆపరేషన్లు చేయడం సవాల్‌తో కూడిన పని అని డాక్టర్ గోని అన్నారు.

‘ఆపరేషన్ తర్వాత మా తల్లిని మళ్ళీ నడిచేలా చేసినందుకు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆస్పత్రికి ఎన్నికృతజ్ఞతలు చెప్పినా తక్కువే’ అని ఆమె కుమారుడు చవినారాయణ గుప్తా అన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ప్రపంచంలో ఇటువంటి ఆపరేషన్ యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 112 ఏళ్ల రోగికి గతంలో జరిగింది.

Latest Updates