రేషన్‍ మొబిలిటీ సక్సెస్‍ 

హైదరాబాద్‍, వెలుగు:  పౌరసరఫరాల వాఖ అమలుచేస్తున్న   ‘రేషన్‍ మొబిలిటీ’ విధానం విజయవంతంగా సాగుతుంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్‍ సరుకులు పొందే సౌలభ్యం రేషన్‍ మొబిలిటీ తో సాధ్యమైంది.   హైదరాబాద్‍లో ఉంటున్న వివిధ జిల్లాలకు చెందిన సుమారు 88 వేల మంది(15శాతం) రేషన్‍ కార్డుదారులు నగరంలోని రేషన్‍ షాపుల్లో జూన్‍ నెలలో సరుకులు తీసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు.  ఇంతకు ముందు రేషన్‍ సరుకులు పొందేందుకు నెలకోసారి వారి సొంతగ్రామానికి  పోవాల్సి వచ్చేది. ఈ రేషన్ మొబిలిటీ ద్వారా ప్రజలు ఎక్కడైనా తమ రేషన్‍ సరుకులు తీసుకునే వీలుండటంతో హైదరాబాద్‍ జిల్లా పరిధిలోని రేషన్‍ షాపుల్లో జూన్‍ నెలలో దాదాపు 84 శాతం కోటా(జిల్లాకు కేటాయించిన) సరుకులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కంటే ఇది దాదాపు 15 శాతం ఎక్కువని చెబుతున్నారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన రేషన్‍ కార్డు దారులు  కూడా నగరంలో తమ సరుకులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతుండడం గమనార్హం.

84 శాతం కోటా ఖాళీ

హైదరాబాద్‌లో తొమ్మిది సర్కిల్స్ పరిధిలో సుమారు 845 రేషన్‍ దుకాణాలు ఉన్నాయి.  వీటి పరిధిలో 5,89,556 ఫుడ్‍ సెక్యూరిటీ కార్డుదారులు(రేషన్‍ కార్డులు) రేషన్‍ సరుకులు తీసుకుంటున్నారు. రేషన్‍ దుకాణాల్లో సరుకులు బ్లాక్‍ మార్కెట్‍కు తరలిపోకుండా నిజమైన లబ్దిదారులకు చేరేలా అధికారులు ఈ–పాస్ విధానం అమలు చేస్తున్నారు. ఆధార్‌ అనుసంధానంతో ఈ–పాస్‌ బయోమెట్రిక్‌లో లబ్ధిదారుల డేటాను ఫీడ్‌ చేయడంతో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు  వేలిముద్రలతో రేషన్‌ సరుకులు ఎక్కడ నుంచైనా తీసుకునే వెసులుబాటు కలిగింది.  జూన్‍ నెలలో 4,95,227(84 శాతం) రేషన్‍ కార్డు దారులు సరుకులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో మహబూబ్‍నగర్‍, రంగారెడ్డి, నల్లగొండ, సంగారెడ్డి, మేడ్చెల్‍, నిజామాబాద్‍, వరంగల్‍, వికారాబాద్‍ తదితర జిల్లాలకు చెందిన రేషన్‍ కార్డుదారులు ఉన్నారని అధికారుల తెలిపారు. ముఖ్యంగా చార్మినార్‍(3వ సర్కిల్‍), ఖైరతాబాద్‍(7వ సర్కిల్‍), మెహిదీపట్నం(5వ సర్కిల్‍), యాఖుత్‍పురా(2వ సర్కిల్‍) పరిధిలోని రేషన్‍ షాపుల్లో ఎక్కువ సంఖ్యలో రేషన్‍ మొబిలిటీ నమోదవుతున్నట్లు సివిల్‍ సప్లై అధికారులు తెలిపారు. రేషన్‍ షాపుల్లో సరుకులు తీసుకునేందుకు నెలలో మొదటి 15 రోజులు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో రేషన్‍ కార్డుదారులు తమ నివాసాలకు దగ్గరలోని షాపుల్లో సరుకులు తీసుకునేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు.

కొన్ని రేషన్‍ షాపులు మధ్యాహ్నం తర్వాత తెరవడం లేదని జిల్లా సివిల్‍ సప్లై అధికారులకు ఫిర్యాదులు చేరుతున్నాయి. సాధారణంగా నెల మొదటి వారంలోనే దాదాపుగా సగం కంటే ఎక్కువ కోటా పూర్తవుతున్నట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపు తెరచి ఉంచే రేషన్‍ షాపులు, బస్తీలకు దగ్గరలో ఉండే షాపుల్లోనే ఎక్కువ మంది లబ్ధి దారులు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా రేషన్ షాపులకు కేటాయించిన కార్డులకంటే ఎక్కువ మంది రేషన్‍ సరుకులు తీసుకునేందుకు వచ్చినప్పుడు రేషన్‍ కోటా సర్దుబాటు చేస్తున్నారు. ఈ–పాస్‍ అమలుతో జిల్లాలో దాదాపు 30–40 శాతం కోటా రేషన్‍ సరుకులు మిగిలినట్లు అధికారులు తెలిపారు. రేషన్‍ మొబిలిటీ అమలు తర్వాత ఇది 15 శాతానికి పడిపోయినట్లు తెలుస్తుంది.

Latest Updates