టీమిండియా సక్సెస్ వెనుక 20 ఏళ్ల శ్రమ

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. నాలుగో టెస్టులో గెలిచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో కైవసం చేసుకుంది. దీంతో యంగ్ ఇండియా పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీలతోపాటు ఇతర దేశాల సీనియర్లు, వెటరన్‌‌లు కూడా మన కుర్రాళ్ల ఆటకు ఫిదా అయ్యామని అంటున్నారు. ఆ కోవలోకి తాజాగా పాకిస్థాన్ మాజీ స్పీడ్‌‌స్టర్ షోయబ్ అక్తర్ చేరాడు. కోచ్ రవిశాస్త్రి యంగ్ ఇండియా కుర్రాళ్లు కలసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని అక్తర్ మెచ్చుకున్నాడు.

‘గబ్బాలో భారత్ విజయం వెనుక ఏముందా అని ఆలోచిస్తున్నా. గత 20 ఏళ్లలో చేసిన కృషికి ఇది ఫలితంగా చెప్పొచ్చు. టీమిండియా బెంచ్ స్ట్రెంగ్త్ ఏంటనేది ఈ యంగ్‌‌స్టర్స్ నిరూపించారు. ఇండియా ఐపీఎల్‌ను స్టార్ట్ చేసింది. దీంతో అనామక ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. విదేశీ ఆటగాళ్లతో కలసి ఆడటంతో భారత కుర్రాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు. వారిపై వారికి నమ్మకం పెరిగింది. అదే టైమ్‌లో క్రికెట్ అకాడమీకి ఎవరు బాధ్యులుగా ఉన్నారో గుర్తుంచుకోవాలి. భారత అత్యుత్తమ టెస్ట్ ప్లేయర్ అయిన రాహుల్ ద్రవిడ్‌‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కుర్రాళ్లను మరింతగా మెరుగుదిద్దాల్సిన అవసరం ఉండటంతో ద్రవిడ్‌కు పవర్స్ ఇచ్చారు. అతడే అండర్-19 టీమ్‌‌ను తయారు చేశాడు. అకాడమీలో ప్లేయర్లకు శిక్షణ ఇస్తూ రాటుదేల్చాడు. ఇప్పుడు అదే ప్లేయర్లు ఆస్ట్రేలియాను మట్టికరిపించారు. భారత్ తన బెంచ్ స్ట్రెంగ్త్‌తో ఆసీస్‌ను చిత్తు చేసింది. క్రికెట్ పై ఇష్టం, ప్రేమ ఉన్న వారికి బాధ్యతలు అప్పజెప్పడం భారత్‌ చేసిన కరెక్ట్ పని. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, రవి శాస్త్రి లాంటి వాళ్లకు ఆ పని ఇవ్వడం సరైన ఫలాలను అందించేందుకు కారణమైంది’ అని అక్తర్ పేర్కొన్నాడు.

Latest Updates