టీమిండియా కుర్రాళ్లదే.!..ఎక్కువ మందికి ఛాన్స్

కళ్ల ముందు రెండు టీ20 వరల్డ్‌‌కప్‌‌లు.. ఇప్పటికే మొదలైన టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌.. ఇప్పటికీ పరిష్కారం కాని మిడిలార్డర్‌‌ వైఫల్యం.. నాలుగో స్థానం కోసం కొనసాగుతున్న వేట.. ఇలా చెప్పుకుంటూ పోతే టీమిండియాలో బలోపేతం చేసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి..! ఈ నేపథ్యంలో మరో రెండేళ్లు టీమిండియా కోచ్‌‌గా ప్రయాణం మొదలుపెట్టబోతున్న చీఫ్‌‌ కోచ్‌‌ రవి శాస్త్రి.. భవిష్యత్‌‌ లక్ష్యాలు, కుర్రాళ్లకు అవకాశాలు, విరాట్‌‌సేన ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తీసుకోబోతున్న చర్యలపై తన మనసులోని మాటలను బయటపెట్టాడు..! ఓవరాల్‌‌గా
రాబోయే రెండేళ్లలో టీమ్‌‌ను ఎలా చూడాలనుకుంటున్నాడో చెప్పాడు..!!

ముంబై : పొట్టి ఫార్మాట్‌‌కు, ఐదు రోజుల టెస్ట్‌‌లకు మధ్య సమన్వయం సాధించడమే తమ ముందున్న అతిపెద్ద సవాలని టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ రవి శాస్త్రి అన్నాడు. 2021 ఇండియాలో జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌ వరకు కోచ్‌‌గా కొనసాగనున్న రవి.. ఎక్కువ మంది కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తామన్నాడు. ‘యువ రక్తంతో కూడిన జట్టు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. 2020, 2021లో మాకు రెండు టీ20 వరల్డ్‌‌కప్‌‌లు ఉన్నాయి. టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ కూడా మొదలైంది. ఈ రెండింటికి మేం టాప్‌‌ ప్రయారిటీ ఇస్తున్నాం. టెస్ట్‌‌ల్లో నంబర్‌‌వన్‌‌ ర్యాంక్‌‌ను కాపాడుకోవాలి. అదే సమయంలో నైపుణ్యం ఉన్న కుర్రాళ్లతో టీ20 వరల్డ్‌‌కప్స్‌‌ను గెలవాలి. టీ20లు ఎక్కువగా ఆడకపోవడం వల్ల ర్యాంకింగ్స్‌‌లో వెనుకబడ్డాం. ఈ కేటగిరీలో టీమ్‌‌ను మరింత మెరుగుపర్చాలి. ప్రస్తుతం మన టీమ్‌‌లో ఐదుగురు మాత్రమే టీ20లకు సరిపోతారు. కాబట్టి బలంగా ఉన్న రిజర్వ్‌‌ బెంచ్‌‌ నుంచి నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుని తీర్చిదిద్దాలి. టీమిండియా భవిష్యత్‌‌ మొత్తం కుర్రాళ్లదే’ అని శాస్త్రి పేర్కొన్నాడు.

ఒత్తిడి ఉంది..

టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ విషయంలో చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే జట్టు మొత్తం అన్ని విభాగాల్లో రాణిస్తేనే ఆ ఫార్మాట్‌‌లో టాప్‌‌లో ఉంటాం. టెస్ట్‌‌లో ఐదు రోజుల పాటు  అనేక సవాళ్లను ఎదుర్కొని, ప్రతీ సెషన్‌‌లో పైచేయి సాధించి, ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్‌‌ చేస్తేనే గెలుస్తాం. అలాంటి టెస్ట్‌‌  ఫార్మాట్‌‌కు ఇప్పుడు పాయింట్ల విధానం యాడ్‌‌ అయింది. రెండేళ్ల పాటు సాగే ఈ టోర్నీలో సత్తా చాటాలని అనుకుంటున్నాం. ఇప్పటికైతే మన టెస్ట్‌‌ జట్టు చాలా బలంగా ఉంది. రాబోయే రోజుల్లోనూ కచ్చితంగా సత్తా చాటుతాం. టెస్ట్‌‌లకు సరిపోయే కుర్రాళ్లకు కూడా ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ వారిని గాడిలో పడేయాలి. అప్పుడే సీనియర్లు లేకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు.

4లో శ్రేయస్‌‌..

వన్డే ఫార్మాట్‌‌లో 2023 దాకా ఐసీసీ టోర్నీలు లేవు. కాబట్టి అవసరమైనన్నీ ప్రయోగాలు చేసుకోవచ్చు. దీనివల్ల మిడిలార్డర్‌‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తున్నాం. ఇప్పుడున్న కుర్రాళ్లకు చాలా అవకాశాలు ఇస్తాం. గత రెండేళ్ల నుంచి చేస్తున్న ప్రక్రియ ముందు కూడా కొనసాగుతుంది. ఆ క్రమంలోనే శ్రేయస్‌‌ అయ్యర్‌‌ దొరికాడు. ఐదో స్థానంలో అతని బ్యాటింగ్‌‌ సూపర్బ్‌‌. ఇప్పుడు నాలుగో నంబర్‌‌ను అతనికే ఇవ్వాలనుకుంటున్నాం. ఫిట్‌‌నెస్‌‌ విషయంలో  రెండేళ్లుగా టీమిండియా ఎక్కడా రాజీ పడలేదు. అందువల్లే షమీ, బుమ్రా 140 కిమీల వేగంతో నిలకడగా బౌలింగ్‌‌ చేస్తున్నారు. ఆటగాళ్లు తమ టాలెంట్‌‌ను పూర్తిగా బయటకు తీయడానికే ఫిట్‌‌నెస్‌‌కు అంత విలువ ఇస్తున్నాం. ముఖ్యంగా షమీ.. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలున్నా తనని తాను నిరూపించుకున్నాడు. క్రికెట్‌‌కు అతనిచ్చిన ప్రాధాన్యం వల్లే అది సాధ్యమైంది. స్పిన్‌‌ ద్వయం కుల్దీప్‌‌-, చహల్‌‌ ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటారు. ఆల్‌‌రౌండర్‌‌ జడేజా సూపర్బ్‌‌ ప్లేయర్‌‌. ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో అతనికి కచ్చితంగా చోటు ఉంటుంది.

30 నిమిషాల్లోనే మారిపోయింది..

గత రెండేళ్లలో అత్యంత నిరాశపరిచిన అంశం ఏదైనా ఉందంటే అది వరల్డ్‌‌కప్‌‌ సెమీఫైనలే. 30 నిమిషాల్లో మొత్తం తారుమారైపోయింది. గెలుపు అంచుల దాకా వచ్చి తడబడ్డాం. టోర్నీ అసాంతం బాగా ఆడాం. లీగ్‌‌లో టేబుల్‌‌ టాపర్‌‌గా నిలిచి టోర్నీని డామినేట్‌‌ చేశాం. ఆయన మనది కానీ రోజున ఏం చేసినా ముందడుగు వేయలేం. మళ్లీ కోచ్‌‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. కోచ్‌‌ సెలెక్షన్‌‌ ప్రక్రియ చాలా కఠినంగా ఉంది. సుదీర్ఘంగా  సాగింది. సీఏసీ సభ్యులు చాలా ప్రశ్నలు వేశారు. జట్టు కోసం ఏం చేస్తామనే దానిపై ప్రజంటేషన్‌‌ ఇచ్చా. కోచ్‌‌గా రీ అపాయింట్‌‌ అవ్వడంతో జట్టు మొత్తం సంతోషించింది. దాదాపు అందరూ నేరుగా వాళ్ల ఫీలింగ్‌‌ను పంచుకున్నారు.

Latest Updates