మళ్లీ శాస్త్రే గురువు!

కెప్టెన్‌‌ కోహ్లీ మద్దతు, జట్టు సాధించిన విజయాలు, బోర్డు నుంచి వస్తున్న లీకులు, జయవర్దనె రేస్‌‌లోకి దిగకపోవడం, టామ్‌‌ మూడీ కంటే పెద్దపేరు పోటీలో లేకపోవడం..ఇవన్నీ చూస్తుంటే టీమిండియా హెడ్​ కోచ్‌‌ పదవిని రవిశాస్త్రి నిలబెట్టుకోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ప్రస్తుతం జట్టుతో కలిసి వెస్టిండీస్‌‌లో ఉన్న శాస్త్రి.. అన్ని కుదిరితే వచ్చే నెలలో స్వదేశంలో జరిగే సౌతాఫ్రికా సిరీస్‌‌లో కొత్త కాంట్రాక్టుతో టీమిండియాను గైడ్‌‌ చేయడం ఖాయమే!

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ పదవిని రవిశాస్త్రి నిలబెట్టుకోవడం దాదాపు ఖాయమైనట్టు అనిపిస్తోంది. కోచ్‌‌ ఎంపిక బాధ్యతను దక్కించుకున్న క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)లోని  ఓ మెంబర్‌‌తోపాటు బీసీసీఐకి చెందిన ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు శాస్త్రి కొనసాగింపు లాంఛనమేనని చెబుతున్నాయి. ‘విదేశీ కోచ్‌‌ను తీసుకురావాలని మేము అనుకోవడం లేదు. గ్యారీ కిర్​స్టన్​ లాంటి పేర్లు లిస్ట్‌‌లో ఉంటే ఆలోచించేవాళ్లమేమో. అప్పుడు కూడా లిస్ట్‌‌లో ఎవరున్నా ఇండియన్‌‌కే మా ప్రాధాన్యం. ఓ ఇండియన్‌‌ కోచ్‌‌ ఆధ్వర్యంలో జట్టు బాగానే రాణిస్తోంది. అలాంటప్పుడు వేరే వాళ్లు ఎందుకు?  ప్రస్తుత పరిస్థితులు చూస్తే  ఫ్రెష్‌‌ కాంట్రాక్ట్‌‌ దక్కించుకునేందుకు శాస్త్రి ఫేవరెట్‌‌గా  కనిపిస్తున్నారు’ అని సీఏసీ మెంబర్‌‌ ఒకరు అన్నారు. ఇదే అంశంపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘కోహ్లీ, శాస్త్రి  ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. అంతేకాక విజయవంతమైన జట్టులో సగ భాగాన్ని మార్చాలనుకోవడం కరెక్టు కాదు. కోచ్‌‌ను మార్చడం వల్ల జట్టు ప్రణాళికలు దెబ్బతినే అవకాశముంది. ఆటగాళ్లకు మానసికంగా కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. ప్రస్తుతమున్న పరిస్థితిలో కొత్త కోచ్‌‌ను తీసుకురావడమంటే వచ్చే ఐదేళ్ల ప్రణాళిక మార్చడమే. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎవ్వరికీ మంచిది కాదు’ అని అన్నారు. దీంతో రవిశాస్త్రి పదవి నిలబెట్టుకోవడానికి రూట్‌‌ క్లియర్‌‌ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, కపిల్‌‌దేవ్‌‌ నేతృత్వంలోని సీఏసీలో అన్షుమన్‌‌ గైక్వాడ్‌‌, శాంతా రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. కోచ్‌‌ ఇంటర్వ్యూలు ఈ నెల మూడో వారంలో జరగవచ్చని చెబుతున్నా.. ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అయితే కోచ్‌‌ ఎంపికలో తుది నిర్ణయం సీఏసీదేనని ఇందులో బీసీసీఐ తలదూర్చదని సీఓఏ చీఫ్‌‌ వినోద్‌‌రాయ్‌‌ స్పష్టం చేశారు. సీఏసీ త్రిసభ్య కమిటీ కావడంతో చైర్మన్‌‌ కపిల్‌‌దేవ్‌‌ ఓటు కీలకం కానుందని వినోద్ రాయ్‌‌ తెలిపారు. కమిటీలోని ఇద్దరు సభ్యులు వేర్వేరు అభ్యర్థులను నామినేట్‌‌ చేస్తే అప్పుడు చైర్మన్‌‌ ఎవరికి ఓటేస్తే వారినే ఎన్నుకుంటారని, ఈనెల మధ్యలో ఇంటర్య్వూలు జరుగుతాయని సీఓఏ చీఫ్ చెప్పారు.

బౌలింగ్‌‌ కోచ్‌‌ రేసులో జోషి

ఇండియా మాజీ స్పిన్నర్‌‌  సునీల్‌‌ జోషి నేషనల్‌‌ టీమ్‌‌ బౌలింగ్‌‌ కోచ్‌‌ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు.  1996 నుంచి 2001 వరకు  టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన జోషి..  బంగ్లాదేశ్‌‌ టీమ్‌‌కు స్పిన్‌‌ కన్సల్టెంట్‌‌గా పని చేశాడు. బంగ్లాతో జోషి కాంట్రాక్టు వరల్డ్‌‌కప్‌‌తో ముగిసింది.

Latest Updates