పోలీసుల‌తో వాగ్వాదం : వివాదంలో ఇండియ‌న్ క్రికెట‌ర్ జ‌డేజా అత‌ని భార్య

మాస్క్ ధ‌రించాలని చెప్పిన పోలీసులపై ఇండియ‌న్ క్రికెటర్ రవీంద్ర జడేజా, భార్య రవిబా వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం..రవీంద్ర జడేజా, అతని భార్య రవిబా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌కోట్ రింగ్ రోడ్‌లో కారులో వెళుతున్నారు. కారులో వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని సమాచారం. వాహన తనిఖీల్లో భాగంగా రాజ్‌కోట్ మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సోనాల్ జ్ఞానేశ్వరి.. జడేజా కారుని ఆపారు. జడేజా మాస్క్ ధరించగా.. అతని భార్య రవిబాకు మాత్రం మాస్క్ లేదు. మాస్క్ ధరించనందుకు జరిమానా చెల్లించాల్సిందిగా సోనాల్ ఆదేశించారు.

జరిమానాను నిరాకరిస్తూ రవీంద్ర జడేజా హెడ్ కానిస్టేబుల్ సోనాల్ జ్ఞానేశ్వరితో గొడవకు దిగాడు. మరోవైపు రవిబా కూడా ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో సోనాల్ సహచర పోలీసులు రాజ్‌కోట్ ఉన్నాతాధికారులకి సమాచారం అందించారు.

రవీంద్ర జడేజాతో గొడవపడిన నిమిషాల వ్యవధిలోనే లేడీ కానిస్టేబుల్ సోనాల్ జ్ఞానేశ్వరి‌ ఒత్తిడి తట్టుకోలేక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

గొడవపై రాజ్‌కోట్ డీసీపీ మనోహర్ ‌సిన్హా స్పందించారు. జడేజా తనతో దురుసు ప్రవర్తించినట్లు లేడీ కానిస్టేబుల్ సోనాల్, ఆమె తనతో దురుసుగా వ్యవహరించినట్లు జడేజా ఆరోపిస్తున్నారు. అయితే ఇద్దరూ ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం.. డ్రైవింగ్ సమయంలో జడేజా మాస్క్ ధరించి ఉన్నాడు. కానీ అతని భార్య రవిబా ఆ టైమ్‌లో మాస్క్ ధరించారా ..? లేదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్న‌ట్లు డీసీపీ మ‌నోహ‌ర్ సిన్హా తెలిపారు.

Latest Updates