నాపై పెట్టినవి తప్పుడు కేసులు : రవిప్రకాశ్

raviprakash-releases-new-video-alleges-all-cases-filed-against-him-are-false-230438-2

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు, సంస్థ కొత్త మేనేజ్ మెంట్ కు మధ్య తలెత్తిన వివాదం కొనసాగుతోంది. రవిప్రకాశ్ పై మేనేజ్ మెంట్ పెట్టిన కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు ఆయన కోసం గాలిస్తుంటే మరోవైపు ఈ వివాదంపై రవిప్రకాశ్ ఓ వీడియో విడుదల చేశారు. తనపై పెట్టిన మూడు కేసులు తప్పుడు కేసులేనన్నారు.

మాజీ సీఈవో రవిప్రకాశ్ పై కొత్త మేనేజ్ మెంట్ రెండు కేసులు పెట్టింది. ఈ కేసుల్లో విచారణ కోసం పోలీసులు నోటీసులిచ్చినా రవిప్రకాశ్ స్పందించకపోవడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. తాజాగా టీవీ9 లోగోను అక్రమంగా అమ్మేశారంటూ మూడో కేసు నమోదైంది. దీంతో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో తనపై పెట్టిన కేసులపై వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు.

తనపై తప్పుడు కేసులు పెట్టారనీ, తీవ్రవాది పారిపోయినట్లుగా అలర్టులు పెట్టామని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారని రవిప్రకాశ్ విమర్శించారు. తనకు, నటుడు శివాజీకి మధ్య జరిగిన ప్రైవేటు ఒప్పంద పత్రాలు కంపెనీ లా ట్రైబ్యునల్ లో ఉండగా దానిపై కేసు నమోదు చేశారని రవిప్రకాశ్ చెప్పారు. ఈ విషయంలో పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.

రెండో కేసులో తన దగ్గర పనిచేసే పార్ట్ టైం ఉద్యోగి దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని తానే ఫోర్జరీ చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అగర్వాల్ ను కిడ్నాప్ చేసి అర్ధరాత్రి కొత్త డైరెక్టర్ల పేర్లను అప్ లోడ్ చేయడానికి ప్రయత్నించారనీ, అతను అప్పటికే రిజైన్ చేయడం వల్ల అది సాధ్యం కాలేదని రవిప్రకాశ్ ఆరోపించారు.

తాజాగా టీవీ9 లోగో వివాదం కూడా అక్రమ కేసేనన్నారు రవిప్రకాశ్. లోగోను సృష్టించింది తానేననీ, దానిపై తనకే హక్కులున్నాయని చెప్పారు. ఈ విషయం తెలుసుకోకుండానే కొత్త మేనేజ్ మెంట్ సంస్థను కొనుగోలు చేసిందన్నారు. ఇప్పుడు లోగోపై తనకు రాయల్టీ చెల్లించకుండా ఎగ్గొట్టడానికే తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

తనపై కేసుల నమోదులో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని రవిప్రకాశ్ విమర్శించారు. కొత్త యాజమాన్యం చెప్పినట్లుగా పనిచేస్తూ, కేసుల పేరుతో తన సన్నిహితులను వేధిస్తున్నారని ఆరోపించారు. యాజమాన్య వివాదంలో వరుస కేసులు నమోదు కావడం.., ఓవైపు పోలీసులు గాలిస్తున్నామని చెబుతుంటే రవిప్రకాశ్ వీడియో విడుదల చేయడం విశేషం. కేసుల నమోదు రోజున లైవ్ లో మాట్లాడిన తర్వాత రవిప్రకాశ్ యాజమాన్య మార్పిడి వివాదంపై మాట్లాడడం ఇదే తొలిసారి.

Latest Updates